సంస్థాన్‌నారాయణపురం, అక్టోబర్ 21 : బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఆ పార్టీ నాయకులే దళితులపై దాడులు, అఘాయిత్యాలు చేస్తున్నారని.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా దళిత వ్యతిరేకిగా మారిందని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మండల కేంద్రంలోనీ దళితవాడల్లో శనివారం మంత్రి పర్యటించారు. మంత్రికి మహిళలు మంగళహారతితో ఘన స్వాగతం పలికారు. దళితులకు అండగా నిలిచి వారికి సముచిత స్థానం కల్పించింది సీఎం కేసీఆర్ ఒక్కరే అని, మునుగోడు ఉప ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. దళితులు ఆర్థికాభివృద్ధి సాధించాలని, వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. రూ.1800 వేల కోట్లకు మునుగోడు ప్రజల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఊరి పొలిమేరల్లోంచే తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. దళితవాడల్లో పర్యటించి ఓటు అడిగే అర్హత బీజేపీ నాయకులకు లేదన్నారు. ఇంటింటికీ తిరుగుతూ “అవ్వ పింఛన్ వస్తుందా.. ఏదైనా సమస్య ఉందా” అని ఆప్యాయంగా పలుకరించారు. కారు గుర్తును గుర్తుంచుకోవాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ జక్కడి జంగారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు గుత్త ప్రేమ్‌చందర్‌రెడ్డి, ఏర్పుల అంజమ్మ, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.