చండూరు, అక్టోబర్ 18 : సీఎం కేసీఆర్ మహిళల పక్షపాతి అని, మహిళలతోనే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని నమ్మిన నాయకుడు అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం చండూరు మండలం పుల్లెంల గ్రామంలో గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా ఆశీర్వాద సభకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి హాజరై మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా పుల్లెంల, ఇడికుడ గ్రామాలకు చెందిన మహిళలు బతుకమ్మలు, బోనాలతో డప్పు చప్పుళ్ల నడుమ ర్యాలీగా సభాస్థలికి చేరుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సభలో గాయకుడు సాయిచంద్ పాటలు మహిళలను ఉత్సాహపరిచాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మహిళల కోసం కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, అమ్మఒడి వంటి పథకాలు ప్రవేశపెట్టి మహిళల పక్షపాతి అని నిరూపించుకున్నారన్నారు. మహిళలతోనే కుటుంబాలు, కుటుంబాలతోనే గ్రామాలు, పట్టణాలు అబివృద్ధి చెంతుతాయన్నారు. మునుగోడులో జరిగే ఉప ఎన్నిక ధర్మానికి, అధర్మానికి జరుగుతున్న ఎన్నిక అని, మహిళలు ధర్మం వైపు నిలబడి కారు గుర్తుకు ఓటు వేసి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతి పథకం మహిళల పేరుతోనే ఉందన్నారు. ప్రజల జేబులు నింపుతున్న కేసీఆర్ కావాలో, గ్యాస్ ధర రూ.1150 వరకు పెంచి దోచుకుంటున్న మోదీ కావాలో మహిళా లోకం తేల్చుకోవాలన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా 24 గంటలు మీ మధ్యలో ఉండే టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గెలిచి నాలుగేండ్లయినా ప్రజలకు అందుబాటులో లేకుండా, కల్యాణలక్ష్మి చెక్కుల బౌన్స్ అవుతున్నా పంపిణీ చేయకుండా పట్టించుకొని స్వార్థపరుడు రాజగోపాల్‌రెడ్డి అని విమర్శించారు.
టీఆర్ఎస్ విజయం నల్లేరుపై నడకే..
మర్రిగూడ : మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం నల్లేరుపై నడకేనని మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మండలంలోని లెంకలపల్లిలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మతతత్వ పార్టీ బీజేపీకి రూ.18 వేల కోట్లకు అమ్ముడుబోయిన ద్రోహి రాజగోపాల్‌రెడ్డి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. కార్యకర్తలంతా సమష్టిగా పనిచేసి టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలిచేలా కృషి చేయాలని సూచించారు. ఆదమరచి బీజేపీకి ఓట్లు వేస్తే మోటర్లకు మీటర్లు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రం మొదలుకొని సంక్షేమ ఫలాలను దేశమంతా అందించాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షకు మునుగోడు విజయంతోనే నాంది పలుకాలని సూచించారు. కాంట్రాక్టుల కోసం అమ్ముడు పోయే రాజగోపాల్‌రెడ్డి కావాలో, సంక్షేమ ఫలాలు అందించే టీఆర్ఎస్ కావాలో ప్రజలు విజ్ఞతతో ఆలోచించి కారు గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పాక నగేశ్‌యాదవ్, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు అయితగొని వెంకటయ్యగౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు వరికుప్పల వెంకన్న, మాజీ ఎంపీటీసీ ఏర్పుల అంజయ్య, నాయకులు యాదగిరి, మల్లయ్య, లారెన్స్ పాల్గొన్నారు.