మర్రిగూడ, అక్టోబర్ 18: ప్రజలను విభజించే రాజకీయాలు తప్ప బీజేపీ ప్రజలకు ఉపయోగపడే రాజకీయాలు చేయడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. దేశంలో బీజేపీ అమలుచేస్తున్న విషపూరిత విధానాలను కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మోసుకొస్తున్నాడని మండిపడ్డారు. ఎమ్మెల్యే అయిన వ్యక్తి మళ్లీ ఎమ్మెల్యే అయ్యేందుకు రాజీనామా చేసి ఏం చేస్తాడని, రాజగోపాల్ రాజీనామా ఎవరికోసం చేశారని నిలదీశారు. మూడున్నరేండ్లు ఆయన మునుగోడు ప్రజల ముఖం చూడాలని మండిపడ్డారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపిస్తే సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పారు. కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మర్రిగూడ మండలంలోని వెంకేపల్లి, కమ్మగూడెం, భోజియాతండా, భీమ్లా తండాలలోకూసుకుంట్లతో కలిసి మంగళవారం మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో తెలంగాణలో తరహాలో సంక్షేమ పథకాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి ఉచిత విద్యుత్త, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి పథకాలు డబుల్ ఇంజిన్ రాష్ర్టాల్లో ఎక్కడా అమలు చేయడం లేదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలకు కొత్తగా నీరు అందించారని, తొమ్మిది విడతల్లో రూ.58 వేల కోట్లు రైతుబంధు పథకం నిధులు 65 లక్షల మంది రైతులకు అందించారని చెప్పారు. సీతారామసాగర్, శివన్నగూడెం వంటి పథకాలు, రిజర్వాయర్లు నిర్మించారని పేర్కొన్నారు. తొమ్మిదేండ్లలో దేశంలో ఎక్కడా ప్రధాని మోదీ పది లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్ట్ కట్టలేదని విమర్శించారు. కార్యక్రమంలో ఫుడ్ అండ్ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ మేడె రాజీవ్‌సాగర్, ఎంపీటీసీ సిలువేరు విష్ణు, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు పందుల పాండుగౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు కొయ్య ఆరోగ్యయ్య, ఎండీ రఫీక్, ప్రధాన కార్యదర్శి ఆంగోత్ విజయకుమార్ నాయక్, సింగిల్ విండో డైరెక్టర్ మార్నినీ లావణ్య అంతయ్య, నాయకులు పార మల్ల లింగయ్య, కారింగు నరసింహ, డామియన్, అమృతయ్య, మధు సురేశ్, మెగావత్ దేవా తదితరులు పాల్గొన్నారు.