సంస్థాన్‌నారాయణపురం, అక్టోబర్ 18 : రాష్ట్రంలో సబ్బండ వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని యావత్ భారతదేశం కోరుకుంటున్నదని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మండలంలోని సర్వేల్ గ్రామంలో మంగళవారం నిర్వహించిన టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని దిశా నిర్దేశం చేశారు. తెలంగాణ ప్రజలతో బీజేపీ నాయకులు చెలగాటమాడుతున్నారని, ఆ పార్టీ చిల్లర చేష్టలను మునుగోడు ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు. మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన రాజగోపాల్‌రెడ్డికి డిపాజిట్ రాకుండా చేయాలన్నారు. మిత్ర పక్షాలు బలపర్చిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం సర్వేల్ గ్రామంలోని పలు వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మార్కెట్, దుకాణాల సముదాయంలో వెళ్లి దుకాణా దారులతో మాట్లాడారు. కారు గుర్తుకు ఓటు వేసి కూసుకుంట్లను గెలిపించాలని కోరారు. సమావేశంలో జడ్పీటీసీ వీరమల్ల భానుమతీవెంకటేశ్గౌడ్, సర్పంచ్ కట్టల భిక్షపతి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.