నల్లగొండ, అక్టోబర్ 17 ;నోళ్లు తెరిచిన బోర్లు.. అడుగంటిన బావులు.. ఎండిన చెరువులు.. వట్టిపోయిన వాగులు.. మునుగోడు ప్రజలు గతం యాది చేసుకుంటే గుండె చెరువు అవుతుంది. ఏడు దశాబ్దాలపాటు ఫ్లోరిన్తోపాటు సాగు, తాగునీటికి తీవ్ర అవస్థ పడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో నియోజకవర్గంలోని కొన్ని చెరువులు పూడిక నిండిపోగా.. మరికొన్ని కబ్జా కోరల్లో చిక్కి ఛిద్రమమ్యాయి. కాకతీయుల నాటి గొలుసు కట్టు చెరువులు సైతం కనుమరుగయ్యాయి. పశువులు తాగునీటి కోసం గోస పడుతుంటే.. గత పాలకులు తొట్లు నిర్మించి చేతులు దులుపుకున్నారే తప్ప.. శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచించ లేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక సాగు నీటికి ప్రాధాన్యమిస్తూ ‘మిషన్ కాకతీయ’ పథకానికి శ్రీకారం చుట్టారు. చెరువుల్లో పూడికతీత పనులు, మర్మమతులు చేపట్టి పూర్వవైభవం తీసుకొచ్చారు. మునుగోడు నియోజకవర్గవ్యాప్తంగా రూ.244 కోట్లతో 422 చెరువులు బాగు చేయడంతో 22,500 ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చింది. భూగర్బ జలాలు పెరిగి బోరు బావుల ద్వారా వేల ఎకరాలు సాగవుతున్నది. మత్స్య కారులకు ఉపాధి దొరకుతున్నది. భూగర్భ జలాలు పెరుగడంతో ఫ్లోరిన్ తీవ్రత తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం నియోజకవర్గంలోని ఏ ఊరికి వెళ్లినా చెరువులు
కళకళలాడుతూ సాగును సస్యశ్యామలం చేస్తున్నాయి.
ఏడు దశాబ్దాలుగా నీళ్లు లేక వెలవెలబోయిన మునుగోడు చెరువులు, నేడు నీటి నిల్వలతో కళకళలాడుతున్నాయి. గతంలో కళకళలాడిన చెరువులు కాలానుగుణంగా కొన్ని పూడిపోగా, మరికొన్ని కబ్జాకు గురయ్యాయి. కబ్జాకు గురైన చెరువులను కాపాడి, పూడిన చెరువుల్లో మట్టిని తీసి, కట్టలను బలోపేతం చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాహసంతో ఇవాళ ఆ చెరువులు నిండుకుండలా మారాయి. నియోజకవర్గ వ్యాప్తంగా రూ.244కోట్లతో 422 చెరువుల్లో 60లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తీసి, వాటిని సర్కారు పునరుద్ధరించింది. దీంతో ప్రత్యక్షంగా ఆయా చెరువుల కింద 22,500 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందుతుండగా, భూగర్బ జలాలు సైతం పెరగడంతో పరోక్షంగా బోరు బావుల ద్వారా వేల ఎకరాల సాగు జరుగుతున్నది. అంతేకాకుండా ఏడు దశాబ్దాలుగా అక్కడి ప్రజలు ఫ్లోరిన్తో ఇబ్బంది పడుతుండగా, ఈ నీటి నిల్వల పెంపు కారణంగా ఫ్లోరిన్ శాతం సైతం తగ్గుముఖం పట్టడం..
మత్స్య కారులకు ఉపాధి వనరుగా మారింది.
రెండు నుంచి మూడు శాతం తగ్గిన పీపీఎం
మిషన్ కాకతీయతో చెరువుల్లోకి వచ్చిన వరద నీరు, కురిసిన వర్షం ఆయా చెరువుల్లోనే నిల్వ ఉండడంతో మునుగోడు నియోజక వర్గంలో భూగర్భ జలాలు పెరగడంతో పీపీఎం శాతం క్రమంగా తగ్గింది. 75 ఏండ్లుగా ఈ ఫ్లోరోసిస్ ప్రభావం ఉండగా భూగర్భం నుంచి వచ్చే నీటిలో ఏడు నుంచి ఎనిమిది శాతం వరకు ఫ్లోరైడ్ ఉన్నట్లు అప్పట్లో గుర్తించారు. అయితే ప్రస్తుతం నియోజకవర్గ వ్యాప్తంగా 2014 సెప్టెంబర్‌లో మునుగోడులో సగటున 9.11 మీటర్ల లోతులో భూగర్భ జలాలుండగా, ఈ ఏడాది సెప్టెంబర్‌లో 5.20 మీటర్లకు ఎగబాకాయి. అత్యంత ఫ్లోరోసిస్ సమస్య ఉన్న మర్రిగూడలో 2014లో 12.99 మీటర్ల లోతులో నీరుండగా, ప్రస్తుతం 5.36 మీటర్లలోనే ఉన్నాయి. ఇక 2014 మే నెలలో మర్రిగూడ మండలం కేబీపల్లిలో 6.2 శాతం పీపీఎం ఉండగా, ఈ ఏడాది మేలో 3.14 శాతానికి తగ్గింది. అదే విధంగా నాంపల్లి మండలం చలవానికుంటలో అప్పుడు 3.92 శాతం ఉండగా, ప్రస్తుతం 1.32శాతం ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అంటే మిషన్ కాకతీయ ద్వారా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ తర్వాత నీటిలో పీపీఎం శాతం రెండు నుంచి మూడు దాకా తగ్గింది.
మునుగోడు చెరువుల పునరుద్ధరణకు రూ.244కోట్లు
కరువు ప్రాంతమైన మునుగోడు చెరువులకు పూర్వవైభవం తీసుకొని రావాలనే ఉద్దేశంతో తెలంగాణ సర్కారు రూ.244కోట్లు వెచ్చించింది. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా 422 చెరువులను పునరుద్ధరించింది. చిన్న చెరువులకు రూ.30లక్షల నుంచి రూ.50లక్షల వరకు, పెద్ద చెరువులకు రూ.50లక్షల నుంచి రూ.1.5కోట్ల వెచ్చించింది. ప్రతి చెరువులో పూడికతీతతో పాటు కట్ట బలోపేతం చేసి ర్యాంపులు, తూములను మరమ్మతు చేసింది. నియోజకవర్గం వ్యాప్తంగా ఆయా చెరువుల్లో 60లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తీసి వాటిల్లో గాడత పెంచడంతో నేడు వర్షం రూపంలో లేదంటే వరదల రూపంలో చెరువుల్లోకి వచ్చిన నీరు వృథాగా వెళ్లకుండా అందులోనే నిల్వ ఉండడంతో ప్రత్యక్షంగా ఆయా చెరువుల కింద నాడు పడావు పడ్డ 22,500 ఎకరాలు సాగులోకి వచ్చింది. ఈ నీరు నిల్వ ఉండడంతో సమీపంలో భూగర్భ జలాలు పెరిగి బోర్లు సైతం ఉబికి వస్తుండడంతో వేల ఎకరాలు సాగులోకి వచ్చి రైతులను సంతోషపెట్టింది.
8వేల కుటుంబాలకు ఉపాధి
మునుగోడు నియోజకవర్గంలో పునరుద్ధరించిన చెరువులు 8వేల కుటుంబాలకు ఆదాయ వనరులుగా మారాయి. నియోజకవర్గ వ్యాప్తంగా 422 చెరువులుండగా, అక్కడ ప్రతి ఏటా ప్రభుత్వం రూ.1.15 కోట్లు వెచ్చించి, 1.35కోట్ల చేప పిల్లలు విడుదల చేస్తున్నది. ఈ చెరువుల్లో మత్స్యకార కుటుంబాలు చేపలు పట్టుకొని, ఆదాయం పొందుతున్నాయి. నిత్యం పెద్దగా అక్కడ చేపలు పట్టకపోయినా, యేటా మార్చి నుంచి జూన్ వరకు చెరువుల్లో చేపలు పట్టి, యేడాదికి రూ.130కోట్ల వరకు ఆదాయం పొందుతున్నట్లు మత్స్యశాఖ యంత్రాంగం పేర్కొంటున్నది. కాలానుగుణంగా ఆదరణ కోల్పోయిన చెరువులు తెలంగాణ సర్కారు చేపట్టిన పునరుద్ధరణతో అవి నిండుకుండలా మారడంతో మత్స్యకారులు ఉపాధి వనరులుగా మారాయి. ఏడెనిమిదేండ్ల క్రితం ఏదో ఒక గ్రామంలో కాస్త పెద్ద చెరువుంటే, అక్కడే చేప పిల్లలు వేసి పెంచారు. అదీనూ ఆ పిల్లలు కొని చెరువుల్లో వేస్తే, ఆ చేపలు కొనడానికి కిలో మీటర్ల కొద్ది వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడా పరిస్థితి మారింది. ప్రతి ఊరిలోనూ చెరువు పునరుద్ధరించిన నేపథ్యంలో అన్ని చెరువుల్లోనూ నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో ప్రభుత్వమే యేటా ఆయా చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలు వేయడంతో మత్స్యకారులు వాటిని అమ్ముకొని, తమ జీవనాన్ని మెరుగు పర్చుకుంటున్నారు.
రైతుల వలసలు ఆగిపోయినయ్
తెలంగాణ ప్రభుత్వం రాక ముందుకు మా ఊళ్లో రైతులందరం వ్యవసాయ కూలీలుగా వలస పోయేటోళ్లం. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంక మిషన్ కాకతీయతో చెరువులను మంచిగా చేసిండు. చెరువుల్ల నీళ్లు బాగా వచ్చినయి. ఇక రైతులందరం వలసపోవడం తగ్గించినం. ఊర్లోనే పొలం పనులు చేసుకుంటున్నం. నేను సోలిపురం చెరువు కింద ఐదు ఎకరాలు సాగు చేసుకుంటున్నా. తెలంగాణ గవర్నమెంట్‌కు మేము రుణపడి ఉంటాం.
– చల్లా లచ్చిరెడ్డి, రైతు, సోలిపురం(మునుగోడు)
బియ్యం కొనే బాధ తప్పింది..
మా ఊర్లో వ్యవసాయానికి నీళ్లు లేక పత్తి పంట వేసేటోళ్లం. తినడానికి బియ్యం కొనుక్కొచ్చుకునేవాళ్లం.. భూమి ఉండి వరిసేను చేయలేని దుస్థితి ఉండే. వేలకు వేలు పెట్టి బియ్యం కొనుక్కొని రావాలంటే చాలా బాధపడే వాళ్లం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మిషన్ కాకతీయతో మా ఊర్లో చెరువును బాగా చేశారు. ఇప్పుడు చెరువు నిండా నీళ్లు ఉన్నయి. మా బావుల్లో మస్తుగా ఉన్నయి. నాకున్న మూడెకరాల్లో యేడాదికి రెండు పంటలు తీస్తున్నా. మాకు తినడానికే కాకుండా ప్రభుత్వం ఐకేపీ ద్వారా గిట్టుబాటు ధర కల్పించడంతో మంచి లాభం వస్తుంది. ఇప్పుడు ధాన్యం గింజలకు ఎలాంటి కొదువ లేకుండా చాలా సంతోషంగా ఉంది.
మా ఊరి చెరువు బాగైంది..
మా ఊరి పెద్ద చెరువు(శివన్నగూడెం చెరువు)లో ఏండేండ్లు చుక్క నీళ్లు లేవు. బోర్లు నీళ్లు పోయకపోయేది. ఒక పూటంతా బోరు పారించినా రెండు గుంటలు తడిసేది కాదు. మిషన్ కాకతీయతో చెరువు బాగైంది. బోరు నీళ్లు పోస్తోంది. ఇప్పుడు నాలుగు ఎకరాలు పారుతున్నది.
– ఆవుల జంగయ్య, రైతు, శివన్నగూడెం, మర్రిగూడెం
మంచి రోజులొచ్చినయ్!
మా తాతల కాలంల బావుల్ల నీళ్లున్నయ్. మళ్లీ ఇప్పుడే అట్ల నిండిన బావులు చూస్తున్న. రెండేండ్ల నుంచి నీళ్లు 50 అడుగు కంటే దిగువకు పోతలేదు. నీళ్లు పెరిగే సరికి మెట్ట పంటలు తగ్గి వరి సాగు పెరిగింది. ఒకప్పుడు మూడు కిలోమీటర్ల దూరం పోయి మంచి నీళ్లు తెచ్చుకున్నం. ఇప్పుడు ఇంటింటికీ నల్లా వచ్చింది. ఆ మంచినీటి కష్టాలు కూడా తీరాయి.
– నున్నగోపుల పెద్దులు, రైతు, శివన్నగూడెం
అయిదు పుట్ల వడ్లు పండుతున్నయి..
నాలుగేండ్ల నుంచి బోడంగపర్తి పెద్ద చెరువు, పెద్దికుంట, ఎర్రకుంట నిండుగా ఉంటున్నయ్. 2017లో పెద్ద చెరువులో పూడిక తీశారు. పూడిక తీశాక చెరువు ఎండలేదు. ఎండాకాలంలో కూడా నాలుగు అడుగుల నీళ్లున్నయి! అంతకుముందు రోజుల్లో ఏటా చెరువు ఎండేది. ఇప్పుడు బోరు ఉన్న రైతులకు వరి బాగా పండుతున్నది. అప్పట్లో నీరు సరిగా లేక దిగుబడి మూడు పుట్ల కంటే ఎక్కువ రాకపోయేది. బోరు బాగా పోయడంతో ఇప్పుడు ఎకరానికి అయిదు పుట్ల వడ్లు పండుతున్నాయి. నాకు మూడు ఎకరాల భూమి ఉంది. వరి, పత్తి పెట్టిన. 4 ఎకరాలు కౌలు చేస్తున్నా. రైతుబంధు వస్తున్నది. ఇప్పుడు అప్పుల్లేకుండా హాయిగా ఉన్న.
– బొమ్మరగోని రామలింగయ్య, రైతు, బోడంగిపర్తి, చండూరు
ఎండకాలంలోనూ కోపుల దాకా నీళ్లు
ఇక్కడ వ్యవసాయానికి చెరువే ఆధారం. మిషన్ కాకతీయకు ముందు చెరువులో పెద్దగా నీళ్లుండేవి కావు. 2012, 13లో చెరువులో సుక్క నీరు లేదు. 2007, 2008 సంవత్సరాల్లో చెరువే కాదు.. బోరు కూడా ఎండిపోయింది. ఈ చెరువు కింద బోరు పావుగంట పోసేది. ఆ తర్వాత నీటి ధార రాకపోయేది. 2015, 2016 మిషన్ కాకతీయ పనుల ద్వారా పూడిక తీయించారు. ఇప్పుడు చెరువు నిండుతున్నది. బోరు నిండుగా ధార పోస్తున్నది. పూడిక తీసిన తర్వాత ఐదేండ్ల నుంచి చెరువు ఎండలే. ఎండాకాలంలో కోపుల దాకా నీళ్లుంటున్నయ్.