నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 17(నమస్తే తెలంగాణ);అడుగడుగునా జనం అడ్డగింతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బీజేపీ మునుగోడు ఉప ఎన్నికల్లో ఉనికి చాటుకునేందుకు అడ్డదారులనే నమ్ముకుంది. నిత్యం సిద్ధాంతాలు వల్లించే కమలం పార్టీ నోట్ల కట్టలపైనే ఆశలు పెట్టుకున్నది. మొదటి నుంచి డబ్బు ప్రవాహం పారిస్తున్నది బహిరంగ సత్యం కాగా, ఇప్పుడు విచ్చలవిడిగా డబ్బు డంప్ చేసేందుకు సిద్ధమై అడ్డంగా బుక్కయ్యింది. మునుగోడు మండలం చల్మెడ చెక్‌పోస్టు వద్ద వాహన తనిఖీల్లో భాగంగా టాటా సఫారీ టీఎస్02ఎఫ్హెచ్ 2425 వాహనంలో తెస్తున్న కోటి రూపాయలను పోలీసులు పట్టుకున్నారు. డబ్బుతో వచ్చిన వ్యక్తి కరీంనగర్ 13వ డివిజన్‌కు చెందిన బీజేపీ కార్పొరేటర్ జయశ్రీభర్త సొప్పరి వేణుగా గుర్తించారు. బీజేపీకి చెందిన మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆదేశం మేరకు విజయవాడకు చెందిన రాము అనే వ్యక్తి నుంచి ఈ నగదును తీసుకొస్తున్నట్లు నిందితుడు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం మునుగోడు పోలీస్ అధికారులు విచారణ కొనసాగిస్తున్నట్లు ఎస్పీ రెమారాజేశ్వరి తెలిపారు. తదుపరి విచారణ కోసం నగదును ఇన్‌కంటాక్స్ ఆఫీసర్లకు అప్పగించనున్నట్లు చెప్పారు.