చౌటుప్పల్, అక్టోబర్ 17: దండు మల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్కులో భూములు కోల్పోయిన 431 మంది నిర్వాసితులకు నవంబర్ 6న పట్టాలిస్తామని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. మండలంలోని దండు మల్కాపూర్ గ్రామంలో సోమవారం ఆయన ఇంటింటికీ తిరుగుతూ విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారు కోమటిరెడ్డి బ్రదర్స్ కాదని.. కోవర్టు బ్రదర్స్ అని విమర్శించారు. రూ.600 పింఛన్ ఇస్తున్న గుజరాత్ మాడల్ కావాలో, రూ.2,016 పింఛన్ ఇస్తున్న తెలంగాణ మాడల్ కావాలో ప్రజలు ఆలోచించాలని అన్నారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఫ్లోరోసిస్ బాధితుడు అంశల స్వామిని తీసుకెళ్లి ఆయన టేబుల్ మీద పడుకోబెడితే అప్పటి పట్టించుకోలేదని విమర్శించారు. అదే ఫ్లోరైడ్ సమస్యకు సీఎం కేసీఆర్ చరమగీతం పాడారని గుర్తుచేశారు. అందుకే గ్రామాల్లో టీఆర్ఎస్ ప్రచారానికి ప్రజలు నీరాజనం పలుకుతున్నారని అన్నారు. ‘సారు కావాలి.. కారు రావాలి..’ అంటూ నినదిస్తున్నారని అన్నారు. దండు మల్కాపూర్‌లో 3,192 మంది ఓటర్లుంటే అందులో 3,100 మంది లబ్ధిదారులు ఉన్నారని వివరించారు. మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఓటు అడగడానికి 100 పథకాలు ఉన్నాయన్నారు. బీజేపీ ప్రభుత్వం ఒక పథకాన్నైనా చూపించగలదా? అని ప్రశ్నించారు. బీజేపీకి డిపాజిట్ దక్కదని, కూసుకుంట్లకు భారీ మెజార్టీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు గిర్కటి నిరంజన్‌గౌడ్, మస్తాన్‌బాబు, ఎలువర్తి యాదగిరి, శ్రీనివాసరావు, కలగోని శ్రీధర్‌గౌడ్, శేఖర్ రెడ్డి, కృష్ణ, రాంప్రసాద్, అనిల్, బల్వంత్, సాయికిరణ్, వెంకటేశం, రవీందర్, హరిప్రసాద్, పృధ్వీ, మీసాల నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు పార్టీలకు చెందిన పలువురు ఆయన సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.