మర్రిగూడ, అక్టోబర్ 17: మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే, నియోజకవర్గ ప్రజలకు కుటుంబ సభ్యుడిగా సేవకుడిగా పని చేస్తానని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. సోమవారం మర్రిగూడ మండలం నామాపురం, కొట్టాల, మేటి చందాపురం, సరంపేట, లెంకలపల్లి, ఇందుర్తి గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఐదేండ్లు పాలించలేని అసమర్థ ఎమ్మెల్యే, చేతకాని దద్దమ్మ రాజగోపాల్‌రెడ్డి అని విమర్శించారు. మునుగోడు నియోజకవర్గ ఆత్మగౌరవాన్ని రూ.18 వేల కోట్లకు అమ్మిన ఆయన్ను ఇప్పుడు కూడా నమ్మి ఓటేస్తే తడిబట్టతో గొంతు కోస్తాడన్నారు. తెలంగాణ రాష్ట్రమంతా అభివృద్ధి జరుగుతుంటే, మునుగోడు మాత్రం అభివృద్ధికి నోచుకోలేదని పేర్కొన్నారు. 2014 నుంచి 18 వరకు తాను చేసిన అభివృద్ధి తప్ప ఎక్కడా అభివృద్ధి జరగలేదని స్పష్టం చేశారు. ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ ఈ ప్రాంతంలో తిరిగి ఫ్లోరైడ్ సమస్యను చూసి చలించిపోయారని, రాష్ట్రం వచ్చాక మిషన్ భగీరథ తెచ్చి, మన గోడు తీర్చారని కొనియాడారు. అదేవిధంగా సాగునీరందిస్తేనే ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని గ్రహించిన సీఎం కేసీఆర్, మునుగోడు నియోజకవర్గంలో 2వేల కోట్లతో 20 టీఎంసీల సామర్థ్యం గల శివన్నగూడెం, లక్షణాపురం ప్రాజెక్టులను ప్రారంభించారని వెల్లడించారు.
ఈ ప్రాజెక్టులు పూర్తయితే రెండు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించవచ్చని తెలిపారు. తన హయాంలోనే మాల్ నుంచి కనగల్ వరకు, కుదాబక్షిపల్లి నుంచి శివన్నగూడెం వరకు, మర్రిగూడ నుంచి గుర్రంపొడి వరకు రోడ్లు నిర్మించడమే కాకుండా ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేశామన్నారు. రాజగోపాల్‌రెడ్డికి నియోజకవర్గ అభివృద్ధిపై శ్రద్ధ లేదని చెప్పారు. తాను లోకల్ అని, తనను గెలిపిస్తే అందరికి అందుబాటులో ఉంటానని, అందరి మధ్యలో ఉండి సామాన్యుడిలా సేవ చేస్తానని పేర్కొన్నారు. ఈ ఉప ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి, తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింలు, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. ఆయా గ్రామాల్లో కాంగ్రెస్, బీజేపీకి చెందిన వందమందికి పైగా నాయకులు మాజీ ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పీటీసీ పాశం సరేందర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దంటు జగదీశ్, ఎంపీటీసీ ఊరి పక్క సరిత నగేశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోటకూరి శంకర్ యాదవ్, సహకార చైర్మన్ బాల నరసింహ, ఉపాధ్యక్షులు గంట కృష్ణ, అయితగోని వెంకటయ్య గౌడ్, సీపీఐ మండల కార్యదర్శి ఈదుల భిక్షంరెడ్డి, మాజీ సర్పంచులు చెరుకు లింగంగౌడ్, రాజు నాయక్, గ్రామ శాఖ అధ్యక్షులు వర్కాల వెంకటేశ్, జనగామ రాజు, అశోక్ గౌడ్, వరికుప్పల వెంకన్న, నాయకులు అయిత గోని గణేశ్‌గౌడ్, సంగేపు గిరినేత, ఎండీ యాసిన్, లోపల భిక్షం తదితరులు పాల్గొన్నారు.