చౌటుప్పల్ రూరల్, అక్టోబర్ 17 : చేయని అభివృద్ధి ప నులు చేసినట్లు ఎందుకు చదువుతున్నావని బీజే పీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సతీమణి లక్ష్మి, బీజే పీ నేత డీకే అరుణ ను దళితులు నిలదీశారు. చౌటుప్పల్ మండలం చిన్నకొండూర్లో సోమవారం డీకే అరుణతో కలిసి ఆమె ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ఆమె గ్రామానికి చేసిన అభివృద్ధి పనులను చదివి వినిపిస్తుండగా అడ్డుకున్నారు. ముత్యాలమ్మ గుడికి రూ.5 లక్షలు ఇచ్చామని చెబుతుండగా త మకు ఎప్పుడు ఇచ్చారంటూ దళితులు నిలదీశారు. గెలువగానే ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పిన రాజగోపాల్ ఇప్పటి వర కు గ్రామానికి రాలేదని మండిపడ్డారు. ఇచ్చిన హామీని నెరవేర్చకుండానే చేసినట్లు చెప్పడమేమిటని వాగ్వాదానికి దిగారు. దీనికి తోడు బెల్ట్ షాపులు మూసేస్తే తన నిధుల నుంచి రూ.5 లక్షలు ఇస్తానని చెప్పి పత్తాలేకుండా పోయాడన్నారు. దాంతో ఏమీ మాట్లాడకుండానే వారు అక్కడి నుంచి జారుకున్నారు.
తప్పుడు మాటలు మాట్లాడొద్దు..
గెలువగానే మా ఊరికి వచ్చి గుడికి రూ.5లక్షలు ఇస్తా అని చెప్పిండు. ఇంతవరకు నయాపైసా ఇవ్వలేదు. ఆయన భార్య ఇప్పుడు ప్రచారానికి వచ్చి ఇచ్చినట్లు లిస్ట్ చదువుతున్నది. చేయని పనులు చేసినమని ఎందుకు చెప్పాలె. ఇప్పటికైనా తప్పుడు కూతలు మానుకోవాలి.
– బక్క యాదయ్య, పెద్దమేతరి,చిన్నకొండూర్, చౌటుప్పల్ రూరల్