చౌటుప్పల్, అక్టోబర్ 17 : కాంట్రాక్టులకు ఆశపడి ఉప ఎన్నికకు కారణమైన బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి డిపాజిట్ దక్కనీయొద్దని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి రెండు, మూడో వార్డుల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని బీజేపీ ఆగం చేయాలని చూస్తున్నదన్నారు. ఆ కుట్రలో భాగంగానే ఉప ఎన్నికలొచ్చాయన్నారు. తెలంగాణను కూడా అదానీ, అంబానీకి కుదవబెట్టాలని చూస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రజల గురించి నిరంతరం ఆలోచించే వ్యక్తి కేసీఆర్ మాత్రమే అన్నారు. ఆయనను విమర్శిస్తున్న నాయకులు ఉద్యమంలో ఎక్కడున్నారన్నారు. ఫ్లోరైడ్ సమస్యను తీర్చిన మహానుభావుడు సీఎం కేసీఆర్ అని స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్ మునుగోడును దత్తత తీసుకుంటానని ప్రకటించడం హర్షణీయమన్నారు. వార్డు ప్రజలను సమన్వయం చేసుకుంటూ బీజేపీకి డిపాజిట్ దక్కనీయొద్దన్నారు. యవతకు టీఆర్ఎస్లో గొప్ప భవిష్యత్ ఉంటుందన్నారు. సమావేశంలో రెండో వార్డు కౌన్సిలర్ బత్తిని రాజ్యలక్ష్మీస్వామి, వార్డు అధ్యక్షుడు నగేశ్‌గౌడ్, సతీశ్‌గౌడ్, రామగోని రఘు, డీవైఏఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అనగాని వెంకటేశ్వర్లు, సీపీఎం మున్సిపల్ కార్యదర్శి బండారు నర్సింహ, రెండో వార్డు కార్యదర్శి ఎ.భూషయ్య పాల్గొన్నారు.