సంస్థాన్ నారాయణపురం, అక్టోబర్ 17: మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు అన్నారు. ప్రభాకర్‌రెడ్డికి ప్రజల్లో భారీ మద్దతు లభిస్తున్నదని అన్నారు. సంస్థాన్ నారాయణపురం మండలం వాయిలపల్లి గ్రామంలో సోమవారం ఆయన ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వల్లే మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అన్నారు. బీజేపీ నాయకుల మాటలు నమ్మి అంధకారంలోకి వెళ్లొద్దని సూచించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్లే నేడు దేశం అభివృద్ధిలో వెనుకంజలో ఉన్నదన్నారు. దేశాన్ని ఆదానీ, అంబానీలకు దోచి పెట్టాలని బీజేపీ చూస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్న మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాలను సీఎం కేసీఆర్ వ్యతిరేకించడం వల్లనే ప్రధాని మోదీ తెలంగాణ అభివృద్ధికి మోకాలు అడ్డుపెడుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు దోటి జంగయ్య, సంజీవరెడ్డి, శ్రీరాముల నరసింహ, దొంతగోని సత్తయ్య గౌడ్, బంటు సైదులు, వనం స్వామి, బాబీ పాల్గొన్నారు.