నేరేడుచర్ల, అక్టోబర్ 16 : ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలనే లక్ష్యంతో పాటు ఓటు హక్కు వినియోగంలో అవకతవకలు అరికట్టడంపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. అందులో భాగంగా ప్రతిఒక్కరూ తమ ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో హుజూర్నగర్ నియోజవకర్గంలోని 7 మండలాల్లో మొత్తం 2,35,865మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటి వరకు 1,99,104(84.41శాతం) మంది ఓటర్లు ఓటర్ ఐడీకి ఆధార్ నంబర్ అనుసంధానం చేయించుకున్నారు. ఇంకా 36761మంది ఓటర్లు అనుసంధానం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ నెల 11వరకు నమోదైన వివరాలు ఇలా ఉన్నాయి.
గతంలో కొందరు వేర్వేరు ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకునే వారు. ఆధార్ అనుసంధానంతో ఆ పరిస్థితికి చెక్ పడనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ఓటురు కార్డుకు ఆధార్ లింక్ నిబంధనతో ఎక్కడైనా ఒకచోట మాత్రమే తమ ఓటు హక్కు కల్గి ఉంటారు. ఓటు హక్కు వినియోగంలో జరుగుతున్న అక్రమాలకు చెక్ పడడంతో పాటు పారదర్శకంగా ఓటు హక్క వినియోగించుకోవచ్చు.
ఓటు హక్కును కలిగిన ప్రతిఒక్కరూ తమ ఓటర్ కార్డుకు ఆధార్ కార్డు లింక్ చేయించుకోవాలి. ఆధార్ నంబర్ నమోదు చేసుకోకపోతే వారు ఓటు హక్కు వినియోగంచుకోలేరు. మండలంలో ఇప్పటి వరకు 79.67 శాతం మంది నమోదైంది. మిగిలిన వారు త్వరగా నమోదు చేసుకోవాలి.
– సరిత, నేరేడుచర్ల తాసీల్దార్