‘ఎక్కడైనా ఎవరైనా చనిపోతే ఉప ఎన్నికలు వస్తాయి. కానీ మునుగోడుకు ఒక దొంగ బీజేపీకి అమ్ముడుపోతే ఉప ఎన్నిక వచ్చింది. అన్నం పెట్టే కేసీఆర్ కావాలో… జేబులకు కన్నం పెట్టే బీజేపీ కావాలో ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి.’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కోరారు. మర్రిగూడ మండలం శివన్నగూడెం, ఖుదాభక్ష్‌పల్లి గ్రామాల్లో ఆదివారం సాయంత్రం టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలిసి మంత్రి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిర పరచాలనే కుట్రతోనే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని బీజేపీ రూ.18వేల కోట్లకు కొన్నదని, ఆ డబ్బు నల్లగొండ జిల్లాకు ఇస్తే అభివృద్ధి పనులు, ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటామని పేర్కొన్నారు. అత్యంత ఫ్లోరైడ్ ప్రాంతమైన మర్రిగూడెం మండలానికి కేంద్రంలోని కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు మంచినీటిని ఇవ్వలేకపోయాయని, సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా శాశ్వత పరిష్కారం చూపారన్నారు.కూసుకుంట్ల ప్రచారం సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక, జనగాం, మర్రిగూడ మండలం అంతంపేట, శివన్నగూడెం, ఖుదాభక్ష్‌పల్లి గ్రామాల్లో జరుగగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. టీఆర్ఎస్తోపాటు సీపీఎం, సీపీఐ శ్రేణులు భారీ ర్యాలీలో పాల్గొన్నారు.
మర్రిగూడ, అక్టోబర్ 16 : ‘మునుగోడుకు ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో.. నియోజకవర్గ ప్రజలు గమనించాలి. ఎక్కడైనా ఎవరైనా చనిపోతే ఉప ఎన్నికలు వస్తాయి. కానీ.. ఇక్కడ ఒక దొంగ బీజేపీకి అమ్ముడుపోతే వచ్చింది. ఈ సమయంలో అన్నం పెట్టే కేసీఆర్ కావాలో… జేబులకు కన్నం పెట్టే బీజేపీ కావాలో ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి.’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మర్రిగూడ మండలంలోని శివన్నగూడెం, ఖుదాభక్ష్‌పల్లి గ్రామాల్లో ఆదివారం సాయంత్రం టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలిసి మంత్రి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత ఫ్లోరైడ్ గల మర్రిగూడెం ప్రాంతానికి కేంద్రంలోని కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు మంచినీటిని కూడా ఇవ్వలేకపోయాయన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ కృష్ణా జలాలు అందించి ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారని తెలిపారు.
దాంతో నాలుగేండ్లలో నల్లగొండ జిల్లాలో ఒక్క ఫ్లోరైడ్ కేసు కూడా నమోదు కాలేదని, ఈ విషయాన్ని కేంద్రమే ప్రకటించిందని అన్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో రూ.40వేల కోట్లు వెచ్చించి 24 గంటల ఉచిత విద్యుత్తు అందిస్తున్నారన్నారు. ఉచిత విద్యుత్, మిషన్ భగీరథ పథకాలకు నిధులు ఇవ్వమని కోరితే కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని విమర్శించారు. ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు, రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.2వేల కోట్లతో శివన్నగూడెం, లక్ష్మణాపురం ప్రాజెక్టులను ప్రారంభించామన్నారు. భూ నిర్వాసితులు అదనంగా నష్టపరిహారం కోరుతున్నారని, అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
భూ నిర్వాసితులంతా ప్రభుత్వానికి అండగా ఉండాలని, ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటే ఫ్లోరైడ్ పీడ విరగడవుతుందని కోరారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు కావాలని బీజేపీ పాలిత రాష్ర్టాల ప్రజలు కేంద్రాన్ని నిలదీస్తుండడంతో ప్రధాని మోదీ తెలంగాణపై కక్ష కట్టాడని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరుచాలనే కుట్రతో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని రూ.18వేల కోట్లకు కొన్నారని విమర్శించారు. ఆ డబ్బును నల్లగొండ జిల్లా అభివృద్ధికి ఇస్తే.. తమ పార్టీ అభ్యర్థిని పోటీ నుంచి తప్పిస్తామని సవాల్ చేశారు. నాయకులకు దమ్ముంటే స్వీకరించాలని డిమాండ్ చేశారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండే టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, అంజయ్యయాదవ్, ఆళ్ల వెంకట్‌రెడ్డి, రాథోడ్ బాబూరావు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల కష్ణారెడ్డి, కర్నాటి శ్రీనివాస్, ఎంపీపీ మెండు మోహన్‌రెడ్డి, జడ్పీటీసీ పాశం సురేందర్ రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు తోటకూరి శంకర్‌యాదవ్, నాయకులు పాల్గొన్నారు.
ఒక్కసారి అవకాశమిస్తే సేవకుడిగా పనిచేస్తా. ఎమ్మెల్యేగా గెలిపిస్తే లక్ష్మణాపురం, శివన్నగూడెం ప్రాజెక్టు పనులను వెంటనే పూర్తిచేసి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తా. కాంగ్రెస్, బీజేపీ కారణంగానే మునుగోడు నియోజకవర్గం వెనుకబాటుకు గురైంది. ఆ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. వేల కోట్లకు అమ్ముడుపోయిన రాజగోపాల్‌రెడ్డికి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. రాజగోపాల్‌రెడ్డి పదవిని త్యాగం చేయలేదు.. మునుగోడు ప్రజల ఆత్మాభిమానాన్ని అమ్ముకున్నాడు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న బీజేపీకి చరమగీతం పాడాలి.
– కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి,
టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి
రాజగోపాల్‌రెడ్డి బలుపుతోనే మునుగోడుకు ఉప ఎన్నికలు వచ్చాయి. రూ.18 వేల కోట్లకు అమ్ముడుపోయిన రాజగోపాల్‌రెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలి. తెలంగాణ పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడం లేదు. బీజేపీకి అమ్ముడుపోయిన రాజగోపాల్‌రెడ్డి ఆయనకు కాంట్రాక్టుల మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదు. డబ్బుతో ఓట్లు కొనాలని చూస్తున్న రాజగోపాల్‌ను చిత్తుగా ఓడించాలి.
– గాదరి కిశోర్‌కుమార్, తుంగతుర్తి ఎమ్మెల్యే
సంస్థాన్ నారాయణపురం, అక్టోబర్ 16 : సంస్థాన్ నారాయణపురం మండలంలోని పుట్టపాక, కడపగంటితండా, వాచ్యాతండా, పల్లగట్టుతండా, గంగమూలతండాల్లో కూసుకుంట్ల ప్రచారం కొనసాగింది. గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి కమ్యూనిస్టు సోదరులంతా కదం తొక్కుతూ ఆహ్వానించారు. మహిళలు యువతులు బతుకమ్మలు, బోనాలు, కోలాటాలతో స్వాగతం పలికారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ పాటలను పాడి కార్యకర్తలను, పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచారు.ప్రచారంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, సీపీఎం నేత, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యురాలు మల్లు లక్ష్మి ఎంపీపీ గుత్తా ఉమాప్రేమ్చందర్రెడ్డి, ఎంపీటీసీ మర్రి వసంతారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్, మండల కార్యదర్శి గాలయ్య, సర్పంచులు దేవీలాల్, సాల శంకర్, సునీతారాజు, నరేశ్, టీఆర్ఎస్, వామపక్ష నాయకులు పాల్గొన్నారు.