ఒకప్పుడు వ్యవసాయం సీజన్ దగ్గర పడుతుందంటే రైతుల్లో తెలియని గుబులు.. పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల వద్దకు కాళ్లరిగేలా తిరుగడమే.. అప్పు పుడితే సరి.. లేకపోతే ఆ యేడు వ్యవసాయం లేనట్టే.. ఇప్పుడా పరిస్థితి లేదు. సీఎం కేసీఆర్ రైతుల కష్టాలను గట్టెక్కించాలని ‘రైతుబంధు’ ప్రవేశపెట్టారు. 2018 వానకాలం సీజన్ నుంచి ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. రైతుబంధువై ఏడాదికి రెండుసార్లు పెట్టుబడి సాయం అందిస్తున్నారు.
నల్లగొండ, అక్టోబర్ 16 : దేశానికి అన్నం పెట్టే రైతు సీజనల్‌గా ఏరువాక దిశగా అడుగుపెట్టగానే మొదట పొలం వైపు కాకుండా వడ్డీ వ్యాపారుల ఇంటి గడప దొక్కుతాడు. దశాబ్దాలుగా దేశ వ్యాప్తంగా జరుగున్న పరిస్థితి. ఇక కరువు ప్రాంతమైన మునుగోడులాంటి రైతుల పరిస్థితి అంతకు మించిన వ్యథ.. ఆరేండ్ల కింది దాకా సాగు నీరు లేక.. సరైన వర్షాలు పడక.. వ్యవసాయం చేయాలంటేనే ఏడ్వాల్సిన పరిస్థితి. ఉన్న భూమిని పడావు పెట్టలేక ఏరువాక వైపు నడిచిన రైతులు, అప్పులు తెచ్చి వ్యవసాయం చేస్తే ఆ అప్పులోల్లకు అసలు వడ్డీ కట్టాలంటేనే పున్నామ నరకం నుంచి బయట పడ్డట్టు ఉండేది. ఆ పరిస్థితికి పుల్‌స్టాప్ పెట్టిన సీఏం కేసీఆర్, 2018లో ప్రవేశపెట్టిన రైతుబంధు రాష్ట్ర రైతాంగానికి ఎంతో ఉపయోగపడగా, కరువు ప్రాంత రైతాంగం అయిన మునుగోడుకు మాత్రం ఓ వరంగా చెప్పవచ్చు.
రైతుబంధు ద్వారా ఎకరాకు రూ.5వేల చొప్పున ప్రతి సీజన్లో పెట్టుబడి సాయం అందజేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండ జిల్లాలో అత్యధికంగా మునుగోడు నియోజకవర్గ రైతాంగానికే అందజేస్తున్నది. జిల్లాలో 5.08లక్షల మంది రైతులుంటే, మునుగోడు నియోజకవర్గంలో 96 809 మంది రైతులకు రైతుబంధు వస్తుంది. రూ.5వేల చొప్పున అందుతున్న ఈ పెట్టుబడి రాయితీ 2018 వానకాలం సీజన్ నుంచి వస్తుంది. ఇప్పటి వరకు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో రూ.824.38కోట్లను సర్కారు అందజేసింది. ఏటా వానకాలంతో పాటు యాసంగి సీజన్‌కు సంబంధించి పంట వేసే ముందే రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నది. నియోజకవర్గంలో అత్యధికంగా నాంపల్లి మండలంలో 20,404 మంది రైతులకు రూ.215.43 కోట్లు అందజేశారు.
ప్రభుత్వ పథకాలను ఎంతో మంది ఆసరాగా చేసుకొని, పేదలను పైరవీకారులు దోచుకోవద్దనే ఉద్దేశంతోనే తొలి విడుతగా చెక్కుల రూపంలో అందజేసిన సర్కారు, ఆ తర్వాత ప్రతి రైతు బ్యాంకు ఖాతా నెంబర్లు తీసుకొని, నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తున్నది. అది కూడా సీజన్‌కు ముందే. దీంతో రైతులు ఏరువాకకు ముందే విత్తనాలు, ఎరువుల బస్తాలు కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచుకుంటున్నాడు. గడిచిన నాలుగున్నరేండ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పథకంతో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు.
గుంట జాగా ఉన్నా ప్రభుత్వం రైతుబంధు ఇస్తున్నది. గరిష్ఠ పరిమితి కూడా లేకుండా పోవడంతో జిల్లా వ్యాప్తంగా రూ.617 కోట్లు ఇస్తున్న సర్కారు, మునుగోడు నియోజకవర్గంలో ప్రతి సీజన్‌కు రూ.120.25 కోట్లు ఇస్తున్నది. ఈ నియోజకవర్గంలో అత్యధికంగా మునుగోడులో 2507 మంది రైతులకు రూ.24.52 కోట్లు ఇస్తుండగా, నాంపల్లి మండలం పెద్దాపూర్‌లో 2316 మందికి రూ.22.90 కోట్లు, నారాయణపూర్ మండలం కడపగంటి తండాలో 2335మంది రైతులకు రూ.20.12కోట్లు వస్తున్నాయి.
సీఎం కేసీఆర్ పెట్టుబడి కోసం రైతులకు రైతుబంధు ఇచ్చి ఆదుకుంటున్న మహనీయుడు. గతంలో పెట్టుబడికి అవస్థలు పడేవాళ్లం. ఇప్పుడు రైతుబంధుతో సీఎం కేసీఆర్ సాయం చేస్తున్నడు. ఆ పైసలతో పొలం పనులు చేస్తున్నం. దీంతో అప్పుల తిప్పలు తప్పాయి. సమయానికి డబ్బులు అందుతున్నాయి. నాకు ఐదెకరాలు ఉంది. కేసీఆర్‌కు రుణపడి ఉంటా. ఇటువంటి పథకం తెలంగాణలో తప్ప ఎక్కడా లేదు.
– కరెంటోత్ నాను, రైతు, కడపగండి తండా(సంస్థాన్ నారాయణపురం)
సీఎం కేసీఆర్ సార్ లేకుంటే వ్యవసాయం దండుగవు. రైతులకు రైతుబంధు ఇచ్చి ఆదుకుంటున్నడు. అదే లేకుంటే మా పని ఉత్తిదే. గతంలో పెట్టుబడులకు అప్పులు చేసేది. వానదేవుడు కరుణించకుంటే ఆ యేడూ బాకీలు పెరిగేవి. మల్ల యేడు పంట పండినా కూడా మిత్తికే సరిపోయేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. పంటలకు ముందే కేసీఆర్ సారు రైతుబంధు ఇస్తుండు. బాకీల కోసం సావుకార్ల దగ్గరికి పోతలేం. మంచిగా బతుకుతున్నం. మాకు ఇలాంటి ప్రభుత్వమే కావాలి.
– జిల్లాల బుచ్చిరెడ్డి, రైతు, ఆరెగూడెం (చౌటుప్పల్ రూరల్)
గత ప్రభుత్వాలు రైతుల గురించి పట్టించుకునేవి కావు. అప్పులు తెచ్చి వ్యవసాయం చేసేటోళ్లం. కానీ, టీఆర్ఎస్ సర్కారు రైతుబంధు వచ్చినప్పటి నుంచి కష్టాలు తీరినయి. నాకున్న ఎకరాకు యేడాదికి రూ.10వేలు వస్తున్నయి. మమ్మల్ని ఆదుకుంటున్న గులాబీ పార్టీకే మేం అండగా ఉంటాం. మునుగోడులో కారు గుర్తుకు ఓటు వేస్తం..
– బండారి పాండు, లక్ష్మీదేవిగూడెం, మునుగోడు.