చేనేతలకు తెలంగాణ సర్కారు చేయూతనందిస్తే.. కేంద్రంలోని బీజేపీ సర్కారు మాత్రం కక్షగట్టింది. దారానికి ఆధారం కావాల్సింది పోయి.. జీఎస్టీతో తెగని భారం మోపుతున్నది. దీంతో ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్న చేనేత రంగానికి కోలుకోలేని దెబ్బతగిలింది. ఈ రంగంపై ఏకంగా 12శాతం జీఎస్టీ తీసుకొచ్చి కార్మికుల జీవితాలతో ఆటలాడుతున్నది. జీఎస్టీ పెంపుతో వస్త్ర ఉత్పత్తుల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఫలితంగా వస్ర్తాల అమ్మకాలు తగ్గి.. నేత కార్మికుల ఉపాధిపై దెబ్బ పడుతున్నది. దాంతో చేనేత కార్మికులు బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేతన్న జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న పువ్వు పార్టీని మునుగోడు ఉప ఎన్నికలో చిత్తుగా ఓడిస్తామని
శపథం చేస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేసింది. సుమారు రెండేండ్ల పాటు జనజీవనం అస్తవ్యస్తమైంది. దీంతో వస్త్రవ్యాపారం కుదేలైంది. చీరెల అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. నేసిన చీరెలు నేసినట్లు గుట్టలుగుట్టలుగా పేరుకుపోయాయి. దీంతో వీవర్స్ కార్మికులకు పని తగ్గించారు. నేతన్నలు చేసిన పనికి కూలి కూడా పెండింగ్‌లో పెట్టారు. నేతన్నల కుటుంబాల జీవనం కష్టంగా మారిన పరిస్థితి.
మునుగోడు నియోజకవర్గంలో వేల కుటుంబాలు చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నాయి. జీఎస్టీ పెంచడంతో వీరందరిపై ఈ ప్రభావం పడుతున్నది. భవిష్యత్‌లో నేత కార్మికులకు గడ్డు పరిస్థితులు ఎదురుకానున్నాయి. చేనేతకు సంబంధించి యార్న్, రసాయనాలు, అద్దకం రంగులు, జరీ ఇతర వస్తువులపై భారీగా జీఎస్టీ మోత మోగుతుంది. దీంతో 20 శాతం వరకు వస్త్ర ఉత్పత్తుల ధరలు పెరుగనున్నాయి. ఫలితంగా మార్కెట్లో చీరెల ధరలు అధికమై అమ్మకాలు గణనీయంగా తగ్గిపోనున్నాయి. దీని ఎఫెక్ట్ వినియోగదారులపై పడుతుంది. ఇప్పటికే చీరెల విక్రయాలు తగ్గు ముఖం పట్టాయి. పెట్టుబడులపై ప్రభావం చూపనున్నది. ఫలితంగా కార్మికులు ఉపాధికి దూరం కానున్నారు. వస్త్ర వ్యాపారం అతలాకుతలం అయ్యే అవకాశం ఉంది.
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పేరుతో ప్రజలపై పెనుభారం మోపుతున్నది. ప్రతి వస్తువుపై జీఎస్టీ మోత మోగిస్తూ అందినకాడికి దోచుకుంటున్నది. అందులో భాగంగా చేనేత రంగంపై జీఎస్టీ బాదుతున్నది. గతంలో వస్త్ర పరిశ్రమపై 5 శాతం జీఎస్టీ ఉండగా.. ఇటీవల కాలంలో ఏకంగా 12 శాతానికి పెంచింది. అంటే ఏకంగా ఏడు శాతం జీఎస్టీ పెంచి నేతన్నల పొట్టగొట్టింది. దీనిపై అప్పట్లోనే చేనేత కార్మిక సంఘాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో అప్పట్లో పలు రాష్ర్టాల్లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తాత్కాలికంగా జీఎస్టీ పెంపును వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ, పూర్తిగా రద్దు చేస్తున్నట్లు మాత్రం ప్రకటించలేదు.
జీఎస్టీ పేరుతో చేనేత కార్మికుల శ్రమను కేంద్ర ప్రభుత్వం శ్రమ దోపిడీ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగానికి ఒక వైపు ఊతాన్నిస్తుంటే, కేంద్రం మాత్రం నడ్డి విరుస్తోంది. ఎడాపెడా పన్నులు వేస్తూ ఇబ్బందులకు గురి చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని ఎత్తివేయకుంటే చేనేత కార్మికులు మరింత కుదేలవుతారు. దీనిపై కేంద్రం పునరాలోచించాలి. ఇలా అయితే మున్ముందు కార్మికులకు చాలా కష్టం అవుతుంది.
– హనుమంతు, చేనేత కార్మికుడు, పుట్టపాక(సంస్థాన్ నారాయణపురం)
మునుగోడు నియోజకవర్గంలో నేత కార్మికులు అధిక సంఖ్యలో ఉంటారు. సుమారు 6 వేల పట్టు మగ్గాలు ఉన్నాయి. 40 వేల దాకా నేతన్న ఓట్లు ఉంటాయి. ముఖ్యంగా చండూరు, గట్టుప్పల్, మర్రిగూడెం, సంస్థాన్‌నారాయణపురం, చౌటుప్పల్, మునుగోడు మండలాల్లో అధిక సంఖ్యలో ఓటర్లు ఉన్నారు. బరిలో నిలిచిన ఏ పార్టీ గెలువాలన్నా.. నేత కార్మికుల ఓట్లు కీలకం కానున్నాయి. అయితే తమ పొట్ట కొడుతున్న బీజేపీకి మాత్రం ఓటుతో బుద్ధి చెబుతామని నేత కార్మికులు, సంఘాలు శపథం చేస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామని ముక్తకంఠంతో చెబుతున్నాయి.
ఇప్పటికే చేనేత రంగం అంతంత మాత్రంగానే ఉంది. జీఎస్టీతో నేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నరు. జీఎస్టీ పెంపుతో మరింత కష్టాల్లోకి నెట్టుతున్నరు. 12 శాతం జీఎస్టీతో చేనేత రంగం పూర్తిగా నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉంది. రెక్కాడితోగాని డొక్కాడని కార్మికుల పరిస్థితి గందరగోళంలో పడింది. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ ఎత్తేయాలి.
– సత్తయ్య, చౌటుప్పల్
నేతన్నలను కేంద్రం ఆదుకోపోయినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అన్ని విధాలుగా అండగా ఉంటున్నది. నూలు, రసాయనాలపై సబ్సిడీ ఇస్తున్నది. పొదుపు పథకం తీసుకొచ్చింది. ఇటీవల రైతు బీమా మాదిరి నేతన్న బీమాకు శ్రీకారం చుట్టింది. నేతన్నలకు చేయూతనిస్తున్న టీఆర్ఎస్కే మా పూర్తి మద్దతు. కారు గుర్తుకే ఓటేస్తాం.
– గంజి యాదగిరి, మునుగోడు