అభివృద్ధి చేస్తావని నమ్మి ఓట్లేస్తే మునుగోడు ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టావంటూ బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై మునుగోడు పల్లెలు మర్లవడుతున్నాయి. అడుగడుగునా అడ్డుకుంటున్నాయి. పగలూ రాత్రి తేడా లేదు, ఊళ్లోకి అడుగు పెట్టడమే ఆలస్యం.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల సంగతేందని చుట్టుముట్టి ప్రజలు
నిలదీస్తున్నారు. సొంత డబ్బుతో కట్టిస్తానన్న బడి, బ్రిడ్జి, కమ్యూనిటీ హాళ్లు ఎక్కడున్నాయో చూపించాలని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ప్రజా సమస్యలు గాలికొదిలేసి, ఏం ముఖం పెట్టుకుని వచ్చి ఓట్లు అడుగుతున్నావని ప్రశ్నలు గుప్పిస్తున్నారు.
బీజేపీ అమ్ముడుపోయావంటూ పాత పార్టీ నాయకులు భగ్గుమంటున్నారు. డౌన్ డౌన్ బీజేపీ.. గో బ్యాక్ రాజగోపాల్‌రెడ్డి అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తున్నారు. తాజాగా శనివారం సంస్థాన్‌నారాయణపురం మండలం గుజ్జ, కోతులాపురం, కొత్తగూడెం, పుట్టపాక గ్రామాల్లో అడ్డుకున్నారు. రాజగోపాల్‌రెడ్డి వెంట ప్రచారానికి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావుకూ కోతులాపురం గ్రామస్తులు చుక్కలు చూపించారు. ‘ముందు.. నువ్వు దుబ్బాకలో గెలిచి ఏం అభివృద్ధి చేశావో’ చెప్పంటూ నిలదీశారు.
సంస్థాన్ నారాయణపురం, అక్టోబర్ 15 : ‘అంజయ్య.. నీ సంగతి చూస్తా. నేనంటే ఏమనుకుంటున్నావో.. తన్నురి నా కొడుకుని తన్నురి’ అంటూ రాజగోపాల్‌రెడ్డి బీజేపీ గుండాలను కాంగ్రెస్ కార్యకర్త మీదికి ఉసిగొల్పి తీవ్రంగా దుర్భషాలాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపురం మండలంలోని కొత్తగూడెం గ్రామంలో రాజగోపాల్‌రెడ్డి శనివారం పర్యటించారు. ఆయన మాట్లాడుతుండగా.. రాజగోపాల్‌రెడ్డి గో బ్యాక్ అంటూ కాంగ్రెస్ శ్రేణులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గెలిచినప్పటి నుంచి మునుగోడు ప్రజలకు ఏం చేశావు..? మళ్లీ గెలిచి ఏం చేస్తావని కాంగ్రెస్ కార్యకర్త అంజయ్య ప్రచారాన్ని అడ్డుకున్నారు.
దాంతో కోపోద్రికుడైన రాజగోపాల్‌రెడ్డి సహనాన్ని కోల్పోయి కాంగ్రెస్ కార్యకర్తలను ఇష్టమొచ్చినట్టుగా తిట్టారు. ఆ వెంటనే బీజేపీ గుండాలు కాంగ్రెస్ కార్యకర్త అంజయ్యపై దాడి చేశారు. కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని నట్టేట ముంచేసి వెళ్లిపోయావని కాంగ్రెస్ కార్యకర్తలు రాజగోపాల్‌రెడ్డిని తిట్టిపోశారు. ‘గుండాలను పెట్టుకుని ప్రచారం చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలను, ప్రజలను బెదిరిస్తున్న నీకు ఓటుతోనే సమాధానం చెబుతామని, మునుగోడు పోలిమేరలో నిన్ను బొంద పెడుతాం’ అని శాపనార్దాలు పెట్టారు. అదేవిధంగా పుట్టపాక గ్రామంలో ప్రచారానికి వెళ్లిన రాజగోపాల్‌రెడ్డిని ఓ కాంగ్రెస్ కార్యకర్త అడ్డుకోగా.. పోలీసులు అతడిని తీసుకెళ్లి పక్కనే ఉన్న దుకాణంలో ఉంచి షటర్ వేశారు. బీజేపీ గుండాలు ఆ కార్యకర్త బైక్‌ను పూర్తిగా ధ్వంసం చేశారు. స్థానికులు, కాంగ్రెస్ శ్రేణులు అడుగడుగునా అడ్డుపడుతుండటంతో రాజగోపాల్‌రెడ్డి ప్రచారాన్ని మధ్యలోనే వదిలేసి వెళ్లిపోతున్న పరిస్థితి నెలకొంది.
2018 సాధారణ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి వందల హామీలు గుప్పించారు. ఎలాగైనా గెలవాలని అడ్డగోలుగా వాగ్దానాలిచ్చారు. గెలిపిస్తే మునుగోడు ప్రజల గోస తీరుస్తానని గొప్పలు చెప్పారు. ఆహో.. ఓహో అని ప్రజలను నమ్మించారు. అరచేతిలో స్వర్గం చూపించారు. అబద్ధాలు, అసత్యాలు, మోసపు మాటలతో నెట్టుకొచ్చారు. కానీ, ఎన్నికల్లో గెలిచాక నియోజకవర్గం వైపు కూడా చూడలేదు. కాంట్రాక్టులు, సొంత పనులకే ప్రాధాన్యమిచ్చారు. ఆఖరికి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయడానికి సమయం కేటాయించలేదు. రైతులు, మహిళలు, యువత సమస్యలను పట్టించుకోలేదు. నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడికక్కడ కుంటుపడింది. హామీలు బుట్టదాఖలు అయ్యాయి.
ఎన్నికల్లో గెలిపిస్తే ప్రభుత్వంతో సంబంధం లేకుండా అభివృద్ధి చేస్తానని ప్రగల్బాలు పలికారు. సొంత పైసలతో అభివృద్ధి చేస్తానని ముచ్చట్లు చెప్పారు. ఎన్నికల సమయంలో ఊరూరు తిరిగి ప్రత్యేకంగా హామీలు ఇచ్చారు. కుల సంఘాలకు బిల్డింగ్లు, గ్రామాల్లో బడులు, గుడులు, కమ్యూనిటీ హాళ్లు, వాటర్ ట్యాంక్‌లు, వాటర్ ఫిల్టర్లు, రోడ్లు, బ్రిడ్జిలు కట్టిస్తానని వాగ్దానాలు ఇచ్చారు. తన ఫౌండేషన్ ద్వారా పింఛన్లు ఇస్తానని చెప్పి గాలికొదిలేశారు. భూనిర్వాసితులకు పరిహారం ఇప్పిస్తానని మాట తప్పారు. కానీ, గెలిచిన తర్వాత ఏ ఒక్కరికి హామీలు అమలు చేయలేదు.
గ్రామంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాకే అడుగుపెట్టాలని నాంపల్లి మండలంలోని తుంగపహాడ్‌లో రాజగోపాల్‌రెడ్డిని గ్రామస్తులు నిలదీశారు. ‘మా ఓట్లతో గెలిచి, కాంట్రాక్టుల కోసం పార్టీ మారిన వ్యక్తివి’.. అంటూ తిరగబడ్డారు.
తీవ్ర అసహనానికి గురైన రాజగోపాల్ రెడ్డి.. ‘కుక్కలు మొరిగితే భయపడను’ అని నోరు పారేసుకోవడంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
వినాయక చవితి సందర్భంగా నారాయణపురం మండలంలోని సర్వేల్ గ్రామ పరిధిలో ఉన్న మర్రిగూడకు వచ్చిన రాజగోపాల్ రెడ్డికి చుక్కెదురైంది. గతంలో గ్రామంలో సొంతంగా సీసీరోడ్లు, వాటర్ ఫిల్టర్ ఏర్పాటుకు హామీ ఇచ్చి అమలు చేయకపోవడంతో మహిళలు తిరగబడ్డారు. ఇప్పటి వరకు గ్రామానికి ఎందుక రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసేదేం లేక రాజగోపాల్ రెడ్డి తోకముడిచి వెళ్లిపోయారు. మళ్లీ మా ఊరు వస్తే మర్యాద దక్కదని మహిళలు హెచ్చరించారు.
ఎమ్మెల్యేగా గెలిచిన మూడున్నరేండ్లలో ఏం అభివృద్ధి చేశావంటూ చౌటుప్పల్ మండలంలోని ఎర్రగడ్డి తండాలో రాజగోపాల్ రెడ్డిని గిరిజనులు అడ్డుకున్నారు. గెలిచాక ఒక్కసారి కూడా గ్రామానికి రాలేదని, ఇప్పుడు మళ్లీ ఓట్ల కోసం ఎట్ల వస్తారని నిలదీశారు.
అక్టోబర్ 12 అల్లాపురంలో..
ఎన్నికల ప్రచారానికి వచ్చిన రాజగోపాల్‌రెడ్డిని చౌటుప్పల్ మండలం అల్లాపురం ప్రజలు అడ్డుకున్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని గెలిపిస్తే, అమ్ముడుపోయారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి అమ్ముడుపోయిన కాంట్రాక్టు, దొంగ అని మండిపడ్డారు. రాజగోపాల్ రెడ్డి గోబ్యాక్.. గో బ్యాక్ అని నినాదాలు చేశారు. చేసేదేంలేక మాజీ ఎమ్మెల్యే పలాయనం చిత్తగించారు.
మునుగోడు మండలంలోని సోలిపురం-మునుగోడు వాగుపై బ్రిడ్జిని నిర్మిస్తానని 2018 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. సర్కారు నిధులిచ్చినా, ఇవ్వకున్నా తన సొంత పైసలతో కట్టిస్తానని వాగ్దానం చేశారు. ఇప్పటి వరకు హామీ నెరవేర్చకపోవడంతో సోలిపురం గ్రామానికి వచ్చిన రాజగోపాల్ రెడ్డిని అడ్డుకున్నారు. బ్రిడ్జి హామీ ఏమైందని నిలదీశారు. ప్రజలకు మయమాటలు చెప్పి సర్ది చెప్పాలని చూసినా జనం వినిపించుకోలేదు. దాంతో ఆయన అక్కడి నుంచి జారుకున్నారు.
గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని మునుగోడు మండలంలోని గంగోరిగూడెంలో గ్రామస్తులు రాజగోపాల్ రెడ్డిని నిలదీశారు. హామీలు అమలు చేయకుండా ఎందుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజగోపాల్‌రెడ్డి 2018లో మా ఊరోల్లని నమ్మించి ఓట్లు వేయించుకుండు. గెలిచినంక మా ఊరుకు ఆయన ఏమీ చేయలే.. అందుకే మా గ్రామంలో ఆయనను అడ్డుకున్నాం.. పైసలు, గుత్తేదారు పని కోసమే మోదీ దగ్గరికిపోయి, మోకరిల్లి పార్టీ మారిండు.. అన్ని అబద్ధాలే చెప్తుండు.. సామాన్యుల నడ్డి విరుస్తున్న బీజేపీని సమర్థిస్తూ ఆ పార్టీ అభ్యర్థిగా మునుగోడులో పోటీ చేస్తున్నందుకు రాజగోపాల్‌రెడ్డికి సిగ్గు ఉండాలి. మా ఊర్ల రోడ్లు, గ్రామపంచాయతీ భవనం కట్టిస్తానని ఎన్నికలప్పుడు చెప్పిండు. ఆయన చెప్పిన ఏ ఒక్క మాట మీద నిలబడలేదు. ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మా ఊరికే రాలే.. అప్పటి నుంచి ఇప్పుడే ఆయన ముఖం చూస్తున్న.. అందుకే మా గ్రామస్తులంతా రాజగోపాల్ రెడ్డిపై కోపంతో ఎక్కడికక్కడ అడ్డుపడుతున్నారు.
– పడసానబోయిన కాంతులు, గుజ్జ గ్రామస్తుడు
సంస్థాన్ నారాయణపురం, అక్టోబర్ 15: మండలంలోని కోతులాపురం గ్రామంలో ప్రచారం నిర్వహించడానికి శనివారం వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు గ్రామస్తులు చుక్కలు చూపించారు.. 2018 ఎన్నికల్లో గెలిపిస్తే కుర్చీ వేసుకొని కోతలాపురం గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చి, ఇంతవరకు మా ఊరికి ఎందుకు రాలేదని కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామ ప్రజలు నిలదీశారు.
గ్రామస్తులకు సమాధానం చెప్పలేక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారాన్ని మధ్యలోనే వదిలేసి కారులో వెళ్లిపోయారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు గ్రామస్తులకు సర్ది చెప్పే ప్రయత్నం చేయగా, దుబ్బాకలో గెలిచి ఏం చేసావ్? ఇప్పుడు మా మునుగోడుకు ఎందుకు వచ్చావు? అని రఘునందన్‌రావును నిలదీశారు. గ్రామస్తులకు సమాధానం చెప్పలేక ఆయన వెనుదిరిగారు. రాజగోపాల్ రెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. రాజగోపాల్ రెడ్డి అనుచరులకు గ్రామస్తులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది.