సంస్థాన్ నారాయణపురం, అక్టోబర్ 14 : బీజేపీ డబ్బు మదంతోనే రాజగోపాల్‌రెడ్డికి టికెట్ కేటాయించి మునుగోడులో ఉప ఎన్నిక నిర్వహిస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆ పార్టీకి అమ్ముడుపోయిన రాజగోపాల్‌రెడ్డిని ప్రజలంతా ఎక్కడికక్కడ తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. సంస్థాన్ నారాయణపురం మండలంలోని మల్లారెడ్డిగూడెం, గుజ్జ, సర్వేల్ గ్రామాల్లో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ్‌రెడ్డి, తుంగతుర్తి, నకిరేకల్ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, చిరుమర్తి లింగయ్య, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలిసి శుక్రవారం రాత్రి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ కూసుకుంట్ల గెలుపుతోనే మునుగోడు అభివృద్ధి సాధ్యమన్నారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు తీసుకొచ్చే దొంగలను గ్రామాల్లోకి రానివ్వవద్దని రైతులకు పిలుపునిచ్చారు. మీటర్లు రావద్దంటే కారు గుర్తుకు ఓటెయ్యాలని కోరారు. తెలంగాణ సంక్షేమ పథకాలకు ఒక్క రూపాయి కూడా కేటాయించని ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌షా.. రాజగోపాల్‌రెడ్డికి 18వేల కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారో బీజేపీ నేతలను నిలదీయాలని ప్రజలకు సూచించారు.
ఆ డబ్బును మునుగోడు నియోజకవర్గానికి కేటాయిస్తే పోటీ నుంచి తప్పుకుంటామని, దమ్ముంటే తమ సవాల్‌ను స్వీకరించాలని అన్నారు. వ్యవసాయ బావులకు మీటర్లు పెట్టేందుకు, విద్యుత్, వ్యవసాయ చట్టాలకు సీఎం కేసీఆర్ ఒప్పుకోకపోవడంతోనే కేంద్రం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని విమర్శించారు. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో రైతులు ఎకరానికి కరెంటు బిల్లు నెలకు రూ.1500 కడుతున్నారని, అదే తెలంగాణలో సీఎం కేసీఆర్ ఉచిత కరెంటు ఇస్తున్నారని తెలిపారు. తెలంగాణ తరహా పథకాల కోసం తన సొంత రాష్ట్రంలో ప్రజల నుంచి డిమాండ్ వస్తున్నందునే సీఎం కేసీఆర్‌పై మోదీ కోపం పెంచుకున్నారన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుచాలి
దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి ఓటు వేసి సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుచాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. సర్వేల్ గ్రామంలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ గెలుపుతోనే మునుగోడుకు మంచి రోజులు వస్తాయన్నారు. కూసుకుంట్లను అత్యధిక మెజారిటీతో గెలిపించి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు కానుక ఇవ్వాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ గెలుపుతో మునుగోడు నియోజకవర్గాన్ని కేటీఆర్ దత్తత తీసుకోబోతున్నారని గుర్తు చేశారు.
గెలిపిస్తే కారు నిండా నిధులు తీసుకొస్తా..
ఉప ఎన్నికల్లో గెలిపిస్తే ప్రభుత్వం నిండా నిధులు తెచ్చి ష్ట్రామరింత అభివృద్ధి చేస్తా. నియోజకవర్గానికి సాగు జలాలు అందించే చర్లగూడెం, లక్ష్మణాపురం ప్రాజెక్టులను పూర్తి చేసి ఆ నీళ్లతో మునుగోడు ప్రజల కాళ్లు కడుగుతా. 2014లో అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపించా. మరోసారి ఇస్తే సేవకుడినై చేస్తా. డబ్బు మదంతోనే రాజగోపాల్‌రెడ్డి ఉప వచ్చారు. ఖర్చు పెట్టలేని అసమర్థుడు రాజగోపాల్‌రెడ్డికి ఓటుతో సమాధానం చెప్పాలి.
– కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి
90వేల ఓట్లను 18వేల కోట్లకు కుదువపెట్టిన రాజగోపాల్
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఓట్లను 18వేల కోట్లకు కుదువపెట్టిన నీచుడు. రాజకీయాల కోసం నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన రాజగోపాల్‌రెడ్డిని మునుగోడు గడ్డమీద నుంచి తరిమికొట్టాలి.
– గాదరి కిశోర్‌కుమార్, తుంగతుర్తి ఎమ్మెల్యే