చౌటుప్పల్ రూరల్, అక్టోబర్ 14 : ఏనాడు గ్రామాల అభివృద్ధి గురించి పట్టించుకోని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటు అడిగే హక్కు లేదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గత ఎన్నికల్లో ఊరూరికి ఎన్నో హామీలిచ్చి, మాట తప్పడని ధ్వజమెత్తారు. ఇప్పుడు గ్రామాలకు వస్తే ఆయనకు కర్రుకాల్చి వాత పెట్టడడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. శుక్రవారం చౌటుప్పల్ మండలం ఆరెగూడెం, కాట్రేవు తదితర గ్రామాల్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ పథకాలు వివరిస్తూ ఆయా గ్రామాల ప్రజలను ఓట్లు అడిగారు. అనంతరం ఆయన మాట్లాడారు. మూడున్నరేండ్లు అభివృద్ధిని పట్టించుకోని రాజగోపాల్‌రెడ్డికి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. నియోజకవర్గ ప్రజలంతా ఏకతాటిపై వచ్చారని చెప్పారు.
అమ్ముడుపోయే బదులు ఢిల్లీ నుంచి ప్రత్యేక నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలని రాజగోపాల్‌రెడ్డికి సవాల్ విసిరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేద వర్గాల అభ్యున్నతికి పాటుపడుతుందన్నారు. తెలంగాణను అన్నపూర్ణగా తీర్చిదిద్దింది సీఎం కేసీఆర్‌ది అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, సర్పంచులు మునగాల ప్రభాకర్‌రెడ్డి, బచ్చ రామకృష్ణ, ఉప సర్పంచ్ మమతామల్లేశ్ యాదవ్, గ్రామ శాఖ అధ్యక్షుడు ఎనపల్లి ముత్తిరెడ్డి, బచ్చ మల్లేశ్ పాల్గొన్నారు.