సంస్థాన్‌నారాయణపురం, అక్టోబర్ 12: మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేది, నిలిచేది టీఆర్ఎస్సే అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో బుధవారం టీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు, బూత్‌ల వారీగా నాయకులకు దిశనిర్దేశం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గురువారంనామినేషన్ సందర్భంగా జనసమీకరణ ఏర్పాట్లపై చర్చించారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ప్రతి ఒక్క ఓటర్ను చేరుకునేలా కార్యక్రమాలు రూపొందించుకుని వారికి ప్రభుత్వ పథకాలను సంపూర్ణంగా అర్ధం అయ్యేలా వివరించాలన్నారు.
కార్యక్రమం లో ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గాదరి కిశోర్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, జడ్పీటీసీ వీరమళ్ల భానుమతీవెంకటేశ్, ఎంపీపీ గుత్తా ఉమాదేవి, సర్పంచ్ చిక్లమెట్ల శ్రీహరి, పీఏసీఎస్ చైర్మన్ జంగారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ భిక్షం, చిలువేరు భిక్షం, రాము, శంకర్, గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం నారాయణపురంలోని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 100 మంది కార్యకర్తలు మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
సూర్యాపేట, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) :మునుగోడు ఉప ఎన్నికలో మాకు ఏ పార్టీ కూడా పోటీకి దగ్గరలో కూడా లేదని ఈ ఎన్నికలు వచ్చిన తీరును ప్రజలు తీవ్రంగా అసహ్యించుకుంటున్నారని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మా ప్రచారమే సీఎం కేసీఆర్ అని ఎనిమిదేండ్ల పాలనలో చేసిన అభివృద్ధితోనే మా పార్టీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలవబోతున్నారన్నారు. ఉప ఎన్నికలో మా గెలుపు నల్లేరుపై నడకే అన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు సాగునీటిని అందించే ప్రణాళిక సీఎం కేసీఆర్ వద్ద ఉందన్నారు.
కాగా మునుగోడు ఉప ఎన్నిక వచ్చిన తీరును ప్రజలు తీవ్రంగా అసహ్యించుకుంటున్నారని కేవలం కోమటిరెడ్డికి రూ.22వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి ఆయనను బీజేపీ అధిష్టానం పావుగా వాడుకుంటుందని చెప్పారు. దేశంలోని అన్ని రాష్ర్టాల్లో బీజేపీ ఉండాలన్న సామ్రాజ్యవాద ఆలోచనతోనే ఈ ఉపఎన్నిక వచ్చిందంటూ మునుగోడు అంటే తెలియని మోదీ సహా ఈశాన్య రాష్ర్టాల మంత్రులు ఉప ఎన్నికపై దృష్టి పెట్టారన్నారు. మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించి బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారని ధీమా వ్యక్తం చేశారు.