భువనగిరి కలెక్టరేట్, అక్టోబర్ 12 : ఈనెల 16 నుంచి నిర్వహించే గ్రూప్-1 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ డాక్టర్ బీ. జనార్దన్‌రెడ్డి సూచించారు. బుధవారం ఆయన రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ అనితారామచంద్రన్, కమిషన్ సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్లు, పోలీస్ సూపరింటెండెంట్లు, పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరీక్షల ఏర్పాట్లపై జిల్లాల వారీగా సమీక్షించారు. అనంతరం జిల్లా ఇన్చార్జి కలెక్టర్ దీపక్‌తివారీ అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
జిల్లాలో 13 పరీక్షా కేంద్రాల్లో 3,644మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం నలుగురు లైజన్, 13 మంది అసిస్టెంట్ లైజన్ అధికారులు, నలుగురు ఫ్లయింగ్ స్కాడ్స్, 13 మంది చీఫ్ సూపరింటెండెంట్లు 204 మంది ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. ఉదయం 10-30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుందని, అభ్యర్ధులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు హాల్‌టికెట్‌తో హాజరు కావాలని పేర్కొన్నారు.
పరీక్షా కేంద్రాలకు ఉదయం 8-30 నుంచే అనుమతిస్తారని, పరీక్షా సమయం ఉద యం 10-15 గంటల తరువాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా హాలులోకి అనుమతి ఉండదన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద బయోమెట్రిక్ ద్వారా అభ్యర్థుల హాజరు నమోదు చేస్తారని చెప్పారు. పరీక్షా కేంద్రాలకు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, వస్తువులు వెంట తెచ్చుకోవద్దన్నారు. చెప్పులు మాత్రమే వేసుకోవాలని, షూస్ వేసుకోవద్దని సూచించారు. http:www.tspsc.gov.in నుంచి హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. బ్లూ,బ్లాక్ పాయింట్ పెన్ను మాత్రమే వాడాలని సూచించారు. పరీక్షలకు సంబంధించి 98480 26032 హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలు కఠినంగా ఉంటుందన్నారు.
సమావేశంలో డీసీపీ కే. నారాయణరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి కే. నారాయణరెడ్డి, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి నాగేశ్వరాచారి, చీఫ్ సూపరింటెండెంట్లు, లైజనింగ్, అసిస్టెంట్ లైజనింగ్ ఆఫీసర్లు విద్య, వైద్య, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.