సంస్థాన్ నారాయణపురం, అక్టోబర్ 12: మునుగోడు ఉప ఎన్నిక.. శ్రమకు, డబ్బు అహంకారానికి మధ్య జరుగుతున్న పోరాటమని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ ధర్మ యుద్ధంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి 60 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. మోదీ రాక్షస పాలనను అంతం చేసి దేశంలో రామరాజ్యాన్ని స్థాపించాలన్న సంకల్పంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారని అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. బీజేపీ నేతలు డబ్బు రాజకీయాలు చేస్తున్నారని, వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా మునుగోడు గడ్డపై గులాబీ జెండా ఎగురడం ఖాయమని స్పష్టం చేశారు. రాజగోపాల్‌రెడ్డి వేల కోట్ల కాంట్రాక్టుల కోసం బీజేపీలోకి వెళ్లి మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని అన్నారు. సమావేశంలో ఎంపీటీసీ విజయ, సర్పంచులు దోటి సైదులు, మంజుల, జన్నాయి కోడె అలివేలు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలోని రైతులకు సీఎం కేసీఆర్ పెద్ద దిక్కులా నిలుస్తున్నడు. రైతు బంధు పథకం పెట్టి రెండు పంటలకు పెట్టుబడి సాయం చేస్తున్నడు. అంతేకాకుండా రైతు బీమా, గొర్రెల పంపిణీ వంటి మంచి పథకాలతో అందరినీ మంచిగా చూస్తున్నడు. ఆయనకే ఓటేత్తం. పోయిన సారి రాజగోపాల్‌రెడ్డిని నమ్మి ఓటు వేసి మోసపోయినం. ఆయన ఇక్కడా ఏ పనీ చేయలే. మళ్లీ ఏ మొఖం పెట్టుకుని ఓటడుగుతడు. కేసీఆర్ వచ్చినంకే మా ఊళ్లు బాగు పడుతున్నయ్. కారు గుర్తుకే ఓటు వేస్తం.
– కొత్తగొల్ల సత్తయ్య, దేవత్‌పల్లి, నాంపల్లి మండలం