సూర్యాపేట, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఈనెల 16న నిర్వహించే గ్రూప్-1 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో గ్రూప్-1 పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో అదనపు కలెక్టర్ ఎస్.మోహన్రావు కలిసి సమీక్షించారు. 16న సూర్యాపేటలోని 31 కేంద్రాల్లో నిర్వహించే గ్రూప్-1 పరీక్షలకు 9,181 మంది అభ్యర్థులు హాజరవుతున్నట్లు తెలిపారు. ఇందుకుగాను 12మంది లైజన్ ఆఫీసర్లు, 31మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 31మంది అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్లను నియమించినట్లు తెలిపారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లను పక్కాగా చేపట్టాలన్నారు. పరీక్షా కేంద్రాలన్నింటిలోనూ తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాలు ఉండాలన్నారు.
అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించవద్దని, అభ్యర్థులు పరీక్షా సమయానికి గంటన్నర ముందుగా హాజరు కావాలని సూచించారు. రూట్ ఆఫీసర్లతో పాటు పోలీస్ సిబ్బంది బందోబస్తు పకడ్బందీగా నిర్వహిచాలని డీఎస్పీ నాగభూషణాన్ని ఆదేశించారు. పరీక్షా సమయంలో నిరంతరం విద్యుత్ ఉండేలా విద్యుత్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎస్.మోహన్రావు, ఇన్చార్జ్ డీఆర్ఓ రాజేంద్రకుమార్, కలెక్టరేట్ ఏఓ శ్రీదేవి, జిల్లా విద్యాధికారి కె.అశోక్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు నిర్భయంగా దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించి మాట్లాడారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను శాఖల వారీగా జిల్లా అధికారులకు అందజేసి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మొత్తం 49 దరఖాస్తులు వచ్చినట్లు తెలి పారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాంబాబు, సభ్యులు తమ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోహన్రావు, అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లాలో వివిధ రంగాల్లో ప్రతిభ న బాల బాలికలకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్-2022 అవార్డులకు ఈనెల 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అవార్డులకు 5 నుంచి 18 ఏండ్లలోపు వారు అర్హులని, ఇన్నోవేషన్, సోషల్ సర్వీస్, ధైర్య సహసాలు, పాండిత్యం, క్రీడలు, కళలు, సాంస్క్రతిక కళలు వంటి సేవా రంగాల్లో ప్రతిభ చూపి ఉండాలన్నారు.ఆన్లైన్లో https://awards.gov.in దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అనంతరం ఆ ప్రతిని జిల్లా సంక్షేమాధికారి, కలెక్టరేట్, సూర్యాపేట కార్యాలయంలో సమర్పించాలని ఆయన పేర్కొన్నారు.