గులాబీ జెండా ధగధగలకు ఎర్రజెండా రెపరెపలు తోడవడంతో టీఆర్ఎస్ ప్రచారం అట్టహాసంగా మొదలైంది. గ్రామాలకు గ్రామాలు వందలాది ప్రజలు కదం తొక్కగా తొలిరోజు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ప్రచారం హోరెత్తింది. మహిళలు బోనాలు, కోలాటాలతో.. పురుషులు డప్పు దరువులు, నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. మునుగోడు మండలం కొరటికల్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సోమవారం తన ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలిరాగా, టీఆర్ఎస్ గెలుపు- మునుగోడు అభివృద్ధికి మలుపు అంటూ నినాదాలు మార్మోగాయి. ప్రచారం ప్రారంభానికి మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు ఎంపీ బడుగుల, మాజీ మంత్రి మోత్కుపల్లి, సీపీఎం, సీపీఐ మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బీజేపీ కుట్రలో భాగమే మునుగోడు ఉప ఎన్నిక అని, ఈ ఎన్నికలో రాజగోపాల్‌రెడ్డికి డిపాజిట్ రాకుండా ఓడించాలని ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి టీఆర్ఎస్ పార్టీ సోమవారం శ్రీకారం చుట్టింది. తొలి రోజు ప్రచారానికి అనూహ్య స్పందన వచ్చింది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మునుగోడు మండలం కొరటికల్ గ్రామంలో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, వామపక్షాల నాయకులు పల్లా వెంకట్‌రెడ్డి, జూలకంటి రంగారెడ్డి, నెల్లికంటి సత్యంతో కలిసి రోడ్‌షో నిర్వహించారు. అడుగడుగునా ప్రచారానికి ఘన స్వాగతం లభించింది. డప్పు చప్పుళ్లు, బోనాలు, కోలాటాలతో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. పండుగ వాతావరణంలో టీఆర్ఎస్ ప్రచారం సాగింది.
నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : మునుగోడు ఉప ఎన్నికల టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సోమవారం మునుగోడు మండలం కొరటికల్ నుంచి ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించగా, గ్రామగ్రామానా ఘనస్వాగతం లభించింది. టీఆర్ఎస్తో పాటు టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించిన సీపీఐ, సీపీఎం నేతలు, కార్యకర్తలు, అభిమానులు, పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం ప్రచారంలో కదం తొక్కారు. టీఆర్ఎస్ అభ్యర్థితో పాటు మంత్రి జగదీశ్‌రెడ్డి తదితరులు గ్రామానికి చేరుకునే సరికి, ఊరి ముందర బ్రిడ్జి వద్దే వందలాది మంది గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. పూలు చల్లుతూ పటాకులు కాల్చుతూ గ్రామంలోకి ఆహ్వానించారు.
గులాబీ, ఎర్రజెండాల రెపరెపల నడుమ తొలిరోజు ప్రచారం కన్నుల పండుగగా సాగింది. మహిళలు నెత్తిన బోనాలు పెట్టుకుని చేతిలో జెండాలు పట్టుకుని ర్యాలీలో అగ్రభాగాన ముందుకు సాగారు. కోలాటాలతో మహిళలు సందడి చేశారు. ఇక డోలు కళాకారుల నృత్యాలు, డప్పుల చప్పులతో ఊర్లు మార్మోగాయి. గ్రామ కూడలిలో జరిగిన ప్రచార సభలోనూ పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి మంత్రి జగదీశ్‌రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి గూడాపూర్ గ్రామంలోకి టీఆర్ఎస్ ప్రచార బృందం వెళ్లగా, అక్కడా ప్రచారం రెండు గంటలు ఆలస్యమైనా సరే భారీ సంఖ్యలో ప్రజలు వేచి ఉన్నారు. గ్రామ వీధుల గుండా టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం శ్రేణులు స్థానిక ప్రజలతో కలిసి ప్రచార ర్యాలీని నిర్వహించారు. కోలాట నృత్యాలు, డప్పుల చప్పుళ్లతో టీఆర్ఎస్ ప్రచారం గ్రామంలో హోరెత్తింది.
మధ్యాహ్న భోజన విరామం అనంతరం గంగోరిగూడెం, రత్తిపల్లి, ఊకొండి, సింగారం, నెరటోనిగూడెం, కోతులారం గ్రామాల్లో ప్రచారం కొనసాగింది. సాయంత్రం ప్రచారం సాగిన గ్రామాల్లోనూ పెద్దసంఖ్యలో ప్రజలు పాలుపంచుకున్నారు. ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రాత్రి వరకు కూడా గ్రామాల్లో టీఆర్ఎస్ ప్రచారానికి మంచి ఆదరణ కనిపించింది. వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు తమ కేసీఆర్ కారు గుర్తుకే ఓటు వేస్తామంటూ ప్రచారంలో స్పష్టం చేస్తున్నారు. మునుగోడులో రాజగోపాల్‌రెడ్డితో అభివృద్ధి ఆగిపోయిందని, ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్నే గెలిపించుకుంటామని ప్రజలు మూకుమ్మడిగా ప్రకటించడం కనిపించింది.
ఇక ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? దాని వెనక బీజేపీ కుట్రలు ఏంటీ? రాజగోపాల్‌రెడ్డికి రూ.18వేల కోట్ల కాంట్రాక్టు ఎలా వచ్చింది? మోదీ, అమిత్‌షాకు ఎందుకు తెలంగాణపై కోపం? బీజేపీ నిజస్వరూపం ఏంటీ? ఇలాంటి విషయాలపై ప్రచారంలో నేతల ప్రసంగాలను ప్రజలు ఆసక్తిగా ఆలకించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే తెలంగాణ ప్రజలకు ఎలాంటి ముప్పు పొంచి ఉంది అన్న విషయాలపై నేతలు చెప్పిన మాటలు ఆలోచనలో పడేలా కనిపించాయి. రాజగోపాల్‌రెడ్డికి కట్టబెట్టిన 18వేల కోట్ల కాంట్రాక్టు డబ్బులను ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి కోసం కేటాయిస్తామంటే, ఉప ఎన్నికల బరి నుంచి తప్పుకోవడానికి సిద్ధమని, అందుకు మోదీ, అమిత్‌షా సిద్ధమా? అని మంత్రి జగదీశ్‌రెడ్డి విసిరిన సవాలు తొలిరోజు ప్రచారంలో హైలెట్‌గా నిలిచింది. నేడు కూడా మునుగోడు మండలంలో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారం కొనసాగనున్నట్లు పార్టీ తెలిపారు.