మర్రిగూడ, అక్టోబర్ 10: ఓట్లు వేసి గెలిపించిన మునుగోడు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి, వారి ఆత్మగౌరవాన్ని రూ.22 వేల కోట్లకు బీజేపీకి అమ్మిన వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నమ్మి టికెట్ ఇచ్చిన కాంగ్రెస్‌ను వీడి అభివృద్ధి కోసమే బీజేపీలో చేరుతున్నానని చెప్పడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్‌లో ఉంటే జరుగని అభివృద్ధి బీజేపీలోకి వెళ్తే ఎలా జరుగుతుందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
మర్రిగూడ మండలం కొండూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ఉప్పునూతల వెంకటేశ్, ప్రధాన కార్యదర్శి జర్పుల శంకర్, యూత్ అధ్యక్షుడు జాల శివ, సీనియర్ నాయకులు ఉప్పునూతల రాములు, జర్పుల రవితో పాటు 20 మంది కార్యకర్తలు సోమవారం మర్రిగూడ ఇన్చార్జి ఏడుపుల గోవింద్‌యాదవ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మంత్రి సమక్షంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మాయమాటలతో జనాన్ని నమ్మించి గెలిచిన తర్వాత మునుగోడు నియోజకవర్గాన్ని బ్రష్టు పట్టించాడని అన్నారు. కూసుకుంట్ల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మునుగోడులో అభివృద్ధి జరిగిందన్నారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే కూసుకుంట్లకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సర్పంచ్ కుంభం నర్సమ్మామాధవరెడ్డి, ఉప సర్పంచ్ పాలకూర్ల జంగయ్య, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు వల్లపు సైదులు యాదవ్, ఈద కృష్ణ పాల్గొన్నారు.