చండూరు, అక్టోబర్ 10: ప్రజలను దోచుకుతినే పార్టీ బీజేపీయేనని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెంచుతూ ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతోందని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా రానీయొద్దని, అసలు ఆ పార్టీని తెలంగాణ నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. చండూరు పట్టణంలోని 2, 3 వార్డులకు సమన్వయకర్తగా హాజరైన ఆయన.. సోమవారం ఇక్కడి ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రాజగోపాల్‌రెడ్డి స్వార్థం కోసమే ఈ ఉప ఎన్నిక వచ్చిందని విమర్శించారు.
మునుగోడు అభివృద్ధి చెందాలన్నా, ఈ నియోజకవర్గానికి మంచిరోజులు రావాలన్నా టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అనంతరం పట్టణంలోని 2, 3 వార్డులను తాను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ వార్డులను అభివృద్ధి చేస్తానని అన్నారు. అంతకుముందు ఆయా వార్డుల్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి ఓటు వేయాలని మహిళలను అభ్యర్థించారు. ఇప్పటికే ఫ్లోరోసిస్ రక్కసి నుంచి నియోజకవర్గ ప్రజలకు విముక్తి కల్పించిన టీఆర్ఎస్ (బీఆర్ఎస్)ను ఈ ఎన్నికలో ఆదరించాలని కోరారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వాలేదని విమర్శించారు.
ఇప్పటికే బీజేపీ అనేక సర్వేలు చేసుకుందని, ఓటమి తప్పదని ప్రతి సర్వేలోనూ తేలిందని అన్నారు. అందువల్లనే రాజగోపాల్‌రెడ్డి ఇప్పుడు తల పట్టుకుంటున్నాని అన్నారు. తెలంగాణలో రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి తెచ్చినా సీఎం కేసీఆర్ ససేమిరా అన్నారని, తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ రైతుల మోటార్లకు మీటర్లను పెట్టనివ్వబోనని స్పష్టం చేశారని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్నాటకకు తాను ఇటీవల వెళ్లానని, అక్కడి ప్రభుత్వం సామాజిక పింఛన్ మొత్తాన్ని రూ.500 కంటే ఎక్కువ ఇవ్వడం లేదని గుర్తుచేశారు. మున్సిపల్ చైర్పర్సన్ తోకల చంద్రకళవెంకన్న, కార్మిక విబాగం జిల్లా అధ్యక్షుడు గుర్రం వెంకట్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మునుగాల నారాయణ రావు, పట్టణ అధ్యక్షుడు భూతరాజు దశరథ, రైతుబంధు సమితి జిల్లా సభ్యులు కోడి వెంకన్న, కళ్లెం సురేందర్ రెడ్డి, పున్న ధర్మేందర్, ముడిగె ఎర్రయ్య యాదవ్, వహిద్, తేలుకుంట్ల జానయ్య, చంద్రశేఖర్, పాశం వెంకట్‌రెడ్డి, హైమద్, చొప్పరి నర్సింహ్మ, దశరథ, రవిందర్ రెడ్డి, జూలూరి అంజనేయులు, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.