చౌటుప్పల్, అక్టోబర్ 9 : మునుగోడు నియోజకవర్గంలో 50 లేదా వంద పడకల ఈఎస్ఐ దవాఖాన ఏర్పాటుకు కృషి చేస్తానని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ కార్మికులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారని, ఇప్పుడు పక్క రాష్ర్టాల కూలీలు 30 లక్షల మంది తెలంగాణలో ఉపాధి పొందుతున్నారని తెలిపారు.
చౌటుప్పల్ పట్టణంలో ఆదివారం నిర్వహించిన కార్మికులు, ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారన్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చలువతో పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడికి వచ్చాయని, దాంతో వేలాది మందికి ఉపాధి దొరుకుతున్నదని తెలిపారు. కార్మికుల కడుపు కొడుతున్న బీజేపీ.. దేశ సంపదను అంబానీ, అదానీలకు కట్టబెడుతున్నదని విమర్శించారు.
కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ చేసేది జోడో యాత్ర కాదు.. చోడో యాత్ర అని ఎద్దేవా చేశారు. మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టిన రాజగోపాల్‌రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. సమావేశంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, కార్మిక సంఘాల నాయకులు రాంబాబు, నారాయణ, వేముల యాదయ్య, కల్లూరి మల్లేశం, నిరంజన్‌గౌడ్, మాధవరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఎన్ని జిమ్మిక్కులు చేసినా టీఆర్ఎస్దే గెలుపు : మ్ంరత్రి మల్లారెడ్డి
చౌటుప్పర్ రూరల్, అక్టోబర్ 9 : ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా మునుగోడులో గెలుపు టీఆర్ఎస్దేనని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. రూ.22వేల కోట్ల కాంట్రాక్టుకు అమ్ముడుబోయిన రాజగోపాల్‌రెడ్డి స్వప్రయోజనాల కోసమే ఉప ఎన్నిక వచ్చిందని మండిపడ్డారు. మండలంలోని ఆరెగూడెం, గుండ్లబావి గ్రామాల్లో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 150 మంది గులాబీ కండువా కప్పుకొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాజగోపాల్‌రెడ్డి 18 ఏండ్లుగా దోపిడీ చేస్తూ కోట్లు సంపాదించాడన్నారు. మళ్లీ మోదీ, అమిత్‌షాతో కలిసి ప్రజలను మోసం చేసేందుకు మునుగోడు ఉప ఎన్నిక రూపంలో వస్తున్నారని మండిపడ్డారు. రాజగోపాల్‌రెడ్డిని చిత్తుగా ఓడించి తగిన బుద్ధి చెప్పాలని, టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్లను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
సీఎం కేసీఆర్ ఎనిమిదేండ్లలో రాష్ర్టాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపారని, అందుకే దేశమంతా కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటుందని అన్నారు. బీజేపీ పాచిపోయిందని, కాంగ్రెస్‌కు దిక్కుదివానా లేదని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, సర్పంచ్ మునగాల ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గిర్కటి నిరంజన్‌గౌడ్, పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.