సంస్థాన్ నారాయణపురం, అక్టోబర్ 9 : మునుగోడు ఉప ఎన్నికల్లో కారు గెలుపును ఎవరూ ఆపలేరని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మండలంలోని పొర్లగడ్డతండా గ్రామపంచాయతీ పరిధిలోని రాధానగర్, సీత్యాతండాల్లో ఆదివారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ మిడిమిడి జ్ఞానంతో తెలంగాణ బిడ్డల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడుతున్నారన్నారు.
కనీస అవగాహన లేకుండా తెలంగాణలో మహిళా మంత్రి లేరనడం హాస్యాస్పదమన్నారు. బండి సంజయ్ మతిభ్రమించి మాట్లాడుతున్నాడని, గులాబీ సైన్యం తలుచుకుంటే రోడ్డు కూడా ఎక్కలేడని హెచ్చరించారు. మునుగోడులో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కదని, మూడో స్థానమే దిక్కని అన్నారు. అనంతరం పొర్లగడ్డతండాకు చెందిన 50 కుటుంబాలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు గిరిజన మహిళలతో కలిసి మంత్రి సంప్రదాయ నృత్యం చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాజునాయక్, నాయకులు బిచ్చునాయక్, రాజేశ్‌నాయక్, శ్రీను పాల్గొన్నారు.