యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకున్నది. గులాబీ పార్టీ క్యాంపెయిన్ జోరు పెంచింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కీలక నేతలతోపాటు పార్టీ కార్యకర్తలు గ్రామగ్రామాన పర్యటిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్నారు. పల్లెల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడంతోపాటు వివిధ వర్గాల ప్రజలతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు.
కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వ మోసాలను ఓటర్లకు తెలియజేస్తూ.. కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి ఓటేస్తామని పలు చోట్ల కుల సంఘాల నేతలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు. చౌటుప్పల్‌లో వివిధ కార్మిక సంఘాలతో జరిగిన సమావేశంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. మునుగోడు మండలంలోని కొరటికల్‌లో నిర్వహించిన దళితుల ఆత్మీయ సమ్మేళంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పాల్గొని గ్రామంలోని దళితవాడల్లో కలియతిరిగారు.
కొనసాగుతున్న వలసల పర్వం
ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ (బీఆర్ఎస్)లోకి వలసల పర్వం కొనసాగుతున్నది. చౌటుప్పల్ మండలంలోని ఆరెగూడెంలో మంత్రి మల్లారెడ్డి సమక్షంలో పలువురు గులాబీ కండువా కప్పుకొన్నారు. నాంపల్లి మండలంలోని మళ్లపురాజుపల్లిలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి సమక్షంలో గౌడ సంఘం నాయకులు టీఆర్ఎస్లో చేరారు. ఇదే మండలంలోని నర్సింహులగూడేనికి చెందిన కాంగ్రెస్ లీడర్లు గులాబీ కండువా కప్పుకొన్నారు. నారాయణపురం మండలంలోని లచ్చమ్మగూడెంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి సమక్షంలో పలువురు కారు పార్టీలో చేరారు. మునుగోడు మండలంలోని జక్కలవారిగూడెంలో వివిధ పార్టీలకు చెందిన 150మంది యువత గులాబీ గూటికి చేరారు.