చౌటుప్పల్ రూరల్, అక్టోబర్ 8 : ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకునేందుకే బీజేపీ కుట్ర పన్ని మునుగోడు ఉప ఎన్నిక తెచ్చిందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ ఢిల్లీలో క్రియాశీలకంగా మారుతాడనే భయం మోదీ, అమిత్ షాకు పట్టుకుందని, అందుకే రాజగోపాల్‌రెడ్డికి రూ.22వేల బొగ్గు గనుల కాంట్రాక్ట్ ఇచ్చి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి ఉప ఎన్నికకు తెరలేపారని చెప్పారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం చౌటుప్పల్ మండలంలోని డి.నాగారం, దామెర, చింతలగూడెం తదితర గ్రామాల్లో ఆయన పర్యటించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. వాటిని చూసి బీజేపీ పాలిత 18 రాష్ర్టాల ముఖ్యమంత్రులు మోదీపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. ఇవన్నీ చేయకపోతే తిరగబడుతారనే ఆలోచనలో మోదీ, అమిత్ షా పడ్డారని అన్నారు. ఇందుకోసం సీఎం కేసీఆర్‌ను కేంద్రంలో అడుగు పెట్టకుండా చేయాలనే కుట్రతో ఈ ఎన్నిక తెచ్చారని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో కనీసం 6గంటల కరెంటు కూడా ఇవ్వడం లేదన్నారు.
బీజేపీ పెద్ద స్కామ్‌ల ప్రభుత్వమని, ప్రధాని మోదీ తన దోస్తుల కోసమే రూ.12లక్షల కోట్ల బ్యాంకు రుణాలు మాఫీ చేశారని విమర్శించారు. అందులో అదానీకి చెందినవే రూ.24వేల కోట్లు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేశారన్నారు. 2జీ స్పెక్ట్రమ్ ఇంటర్నెట్ను 15ఏండ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1.70 లక్షల కోట్లకు అమ్మితే.. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం 5జీ నెట్‌వర్క్‌ను రూ.1.40లక్షల కోట్లకే విక్రయించిందని తెలిపారు. ఇవన్నీ పెద్ద కుంభకోణాలని, ఈ డబ్బుతో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలను కూలదోసి తమ పార్టీకి పట్టం కడుతున్నారని విమర్శించారు.
రాజగోపాల్‌రెడ్డి చేతకానితనం, వ్యక్తిగత స్వార్థం కోసమే ఈ ఎన్నిక వచ్చిందని, నాలుగేండ్లు ఎమ్మెల్యే పదవి అనుభవించి మరో ఏడాది ఉండగా రాజీనామా చేసి ఉప ఎన్నికకు రావడం విడ్డూరంగా ఉన్నదని విమర్శించారు. ఏ రోజైనా గ్రామాల అభివృద్ధిని పట్టించుకున్నాడా అని ప్రశ్నించారు. కనీసం తట్టెడు మట్టి పని కూడా చేయని రాజగోపాల్‌రెడ్డి చిత్తుగా ఓడిపోతారని చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) రాష్ట్ర నాయకులు వేమిరెడ్డి నర్సింహారెడ్డి, జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, సర్పంచులు కళ్లెం శ్రీనివాస్‌రెడ్డి, నారెడ్డి ఆండాలు, పార్టీ మండలాధ్యక్షుడు గిర్కటి నిరంజన్‌గౌడ్, నాయకులు పాల్గొన్నారు.