నిడమనూరు, సెప్టెంబర్ 19 : మండలంలోని వేంపాడు శివారులో నాగార్జునసాగర్ ఎడమ ప్రధాన కాల్వ గండి పూడ్చివేత పనులు తుది దశకు చేరుకున్నాయి. మంగళవారం మధ్యా హ్నం వరకు కట్ట పనులు పూర్తి చేసి మంగళవారం సాయంత్రం ఎడమ కాల్వకు సాగు నీటిని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఎన్నెస్పీ ఈఈ ఆర్. లక్ష్మణ్ తెలిపారు. మొదట 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామని, తర్వాత పెంచుతామన్నారు. ఎడమ కాల్వ పరిధిలో సాగు చేసిన పంటలకు నీటి విడుదల దృష్ట్యా పనులను వేగంగా పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
యుద్ధ ప్రాతిపదికన పనులు
ఈ నెల 7న సాయంత్రం అండర్ టన్నెల్లో ఏర్పడిన రంధ్రం కారణంగా కట్ట కోతకు గురై గండి పడగా మరుసటి రోజు నుంచే అధికారులు మరమ్మతు పనులు ప్రారంభించారు. పదమూడు రోజులుగా గండి అడుగు భాగంలో సీసీ బెడ్ పనులతో పాటు మట్టి కట్ట నిర్మాణం చేపట్టారు. గండి పడిన ప్రాంతంలో పెద్ద ఎత్తున నిల్వ ఉన్న నీటిని తోడేందుకు కొంత సమయం పట్టడంతో నిర్మాణ పనులకు ఆటంకం ఏర్పడింది. కాల్వ మధ్య భాగంలో 60 మీటర్ల పొడవు 35 మీటర్ల వెడల్పుతో గండి పడగా ఆ ప్రాంతంలో బెడ్ వేయడంతో పాటు దానిపై ఇసుక బస్తాలు వేశారు. కట్ట స్థానంలో సోమవారం సాయంత్రానికి 5 మీటర్ల ఎత్తులో మట్టితో నిర్మాణం పూర్తి చేశారు.