భువనగిరి కలెక్టరేట్, సెప్టెంబర్ 17 : తెలంగాణలో నేడు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు అనుభవిస్తున్నామంటే.. ఆనాటి సాయుధ పోరాటయోధుల త్యాగాల ఫలితమేనని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండాను శనివారం ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని ఆమె స్వీకరించి మాట్లాడారు. తెలంగాణ గడ్డ మీద ఎంతో మంది అసమాన త్యాగాలు చేశారన్నారు.
దేశానికంతా 1947లో స్వాతంత్య్రం వస్తే తెలంగాణకు మాత్రం నిజాం కబంధహస్తాల్లో ఉండి స్వేచ్ఛా స్వాతంత్య్రాలు దూరమయ్యాయన్నారు. హైదరాబాద్ సంస్థానంలో నిజాం పరిపాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, నిజాం సైన్యం దమనకాండతో ఈ ప్రాంత ప్రజలు అవస్థలు పడ్డారని గుర్తు చేశారు. దోపీడీలు, దౌర్జన్యాలు, దాడులతో తెలంగాణలో ఆనాడు అరాచక పాలన సాగించారని తెలిపారు.
రజాకార్ల నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని, రాచరిక పాలనను అంతం చేయాలని ఆడ, మగ తేడా లేకుండా సాయుధ పోరాటంలో పాల్గొన్నారన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఎందరో వీరులు కీలకంగా వ్యవహరించారని, సామాన్యులు సైతం అందులో భాగస్వాములయ్యారని తెలిపారు. నాటి సాయుధ పోరాట స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ముందుకు సాగిందన్నారు. స్వరాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలను మూడ్రోజుల పాటు నిర్వహించడం గొప్ప విషయమన్నారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్ఠిగా పనిచేసి అభివృద్ధిలో జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలుపాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, రాష్ట్ర ఆయిల్‌ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్లు దీపక్ తివారీ, డి.శ్రీనివాస్‌రెడ్డి, డీసీపీ కె.నారాయణరెడ్డి, ఆర్డీఓ భూపాల్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.