తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తూ విచ్ఛిన్నకర శక్తులు ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు రాజకీయ కుట్రలు చేస్తున్నాయని, అలాంటి కుట్రపూరిత శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కోరారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు రావి నారాయణరెడ్డి స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రావి నారాయణరెడ్డి 31వ వర్ధంతి సందర్భంగా శనివారం భువనగిరి మండలం బొల్లేపల్లి గ్రామంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డితో కలిసి నారాయణరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో అప్పటి ప్రధాన మంత్రి నెహ్రూ కంటే అత్యధిక మెజారిటీ సాధించిన ప్రజా నాయకుడు రావి నారాయణరెడ్డి అని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి భువనగిరి, నల్లగొండతోపాటు హైదరాబాద్‌లో ఆయన విగ్రహాలు ఏర్పాటుకు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.
భువనగిరి కలెక్టరేట్, సెప్టెంబర్ 17 : కొందరు తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తూ రాజకీయ పబ్బం గడుపుకొంటున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో క్రియాశీల పాత్ర పోషించిన రావి నారాయణరెడ్డి 31వ వర్ధంతి సందర్భంగా మండలంలోని బొల్లేపల్లి గ్రామంలో శనివారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రావి నారాయణరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నదని విమర్శించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఎందరో తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా రజాకార్ల పాలనకు వ్యతిరేకంగా పోరాడారన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తెలంగాణ సాయుధ పోరాటం ఉవ్వెత్తున సాగిందన్నారు. రావి నారాయణరెడ్డి సారథ్యంలో ప్రజలు ఉద్యమంలో పాల్గొని నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ముందుకు సాగారని తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కన్నా అత్యధిక ఓట్లు సాధించి ముందు వరుసలో నిలిచిన ప్రజా నాయకుడు రావి నారాయణరెడ్డి అని కొనియాడారు. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజల విముక్తి కోసం రావి నారాయణరెడ్డి పోరాట పటిమ అనిర్వచనీయమని, భావితరాలకు ఆదర్శనీమని పేర్కొన్నారు. భువనగిరి, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో ఆయన విగ్రహాల చర్యలు చేపడుతానని తెలిపారు. హైదరాబాద్‌లో సైతం ఆయన విగ్రహ ఏర్పాటుకు సీఎం కేసీఆర్‌తో మాట్లాడుతానని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గెరిల్లా పోరు చేసిన రావి నారాయణరెడ్డి పుట్టిన నేలలో మనం పుట్టడం ఎంతో అదృష్టంగా భావించాలన్నారు.
రావి నారాయణరెడ్డి ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. రావి నారాయణరెడ్డి స్ఫూర్తికి చిహ్నంగా భువనగిరిలో ఆయన విగ్రహ ఏర్పాటుకు సమగ్ర చర్యలు చేపడుతానన్నారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, రావి నారాయణరెడ్డి వారసులు రావి రుషికేశ్‌రెడ్డి, రావి ప్రతిభారెడ్డి, సీపీఐ రాష్ట్ర నాయకులు కందిమల ప్రతాప్‌రెడ్డి, పల్లా నర్సింహారెడ్డి, ఆరుట్ల సుశీలాదేవి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్‌గౌడ్, రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ కొలుపుల అమరేందర్, ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామి, జడ్పీటీసీ సుబ్బూరు బీరుమల్లయ్య, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల రాజేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నోముల పరమేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చింతల కిష్టయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జనగాం పాండు, మాజీ ఎంపీపీలు అతికం లక్ష్మీనారాయణగౌడ్, కేశవపట్నం రమేశ్, మాజీ జడ్పీటీసీ సందెల సుధాకర్, ప్రధాన కార్యదర్శి నీల ఓంప్రకాశ్‌గౌడ్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు బల్గూరి మధుసూదన్‌రెడ్డి, జక్క రాఘవేందర్‌రెడ్డి, గ్రామసర్పంచ్ మద్ది బుచ్చిరెడ్డి, ఎంపీటీసీ గడ్డమీది చంద్రకళ, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ కంచి మల్లయ్య, సీపీఐ నాయకులు ఏశాల అశోక్, ఎండీ.ఇమ్రాన్, టీఆర్ఎస్ నాయకులు జడ ల యశీల్గౌడ్, మోడెపు శ్రీనివాస్, సందెల శ్రీనివాస్, కృష్ణారెడ్డి, మధు, పాల్గొన్నారు.