నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్16(నమస్తే తెలంగాణ): ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాలన్నీ భారీ సమైక్యత ర్యాలీలు, సభలతో సందడిగా మారాయి. సూర్యాపేటలో వేలాది మంది ర్యాలీలో పాల్గొన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి స్వయ ంగా జాతీయ పతాకాన్ని చేబూని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎస్పీ రాజేంద్రప్రసాద్, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రజలనుద్దేశించి మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడారు. తుంగతుర్తిలో సమైక్యతా ర్యాలీతో త్రివర్ణశోభితంగా మారింది. జడ్పీ చైర్మన్ గుజ్జ దీపికాయుగేంధర్రావుతో కలిసి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. కోదాడలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ నేతృత్వంలో సాగిన ర్యాలీలో ప్రజలు పెద్ద ఎత్తు న పాల్గొన్నారు. హూజూర్‌నగర్‌లో ఎమ్మెల్యే శానంపూడి సైడిరెడ్డి కళాకారులతో కలిసి కోలాటం ఆడుతూ ర్యాలీలో సందడి చేశారు.
నల్లగొండలో లక్ష్మీ గార్డెన్స్ నుంచి ఎన్జీకాలేజీ వరకు కిలోమీటర్ల మేర సాగిన ర్యాలీతో పట్టణం కిక్కిరిసిపోయింది. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ రెమా రాజేశ్వరిలతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు ర్యాలీని ముందుకు నడిపించారు. నకిరేకల్‌లో ప్రధా న రహదారి అంతటా ర్యాలీతో సందడి నెలకొంది. జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ర్యాలీకి నాయకత్వం వహిస్తూ మహిళలతో కలిసి బతుకమ్మ సెప్టులేసి సందడి చేశారు. మిర్యాలగూడలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డిలతో కలిసి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ర్యాలీని ప్రారంభించారు. ఎన్ఎస్పీ క్యాంపు గ్రౌండ్స్ వరకు భారీ ర్యాలీ సాగగా అక్కడే నిర్వహించిన సభలో గుత్తా ప్రసంగించారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినందుకు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్ నాయక్‌పాల్గొన్నారు.
దేవరకొండలో జరిగిన సమైక్యతా ర్యాలీలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్ వేలాది మంది ప్రజలతో కలిసి కదం తొక్కారు. ప్రధాన రహదారి జనంతో కిక్కిరిసిపోయింది. చండూరులో ర్యాలీని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ జెండా ఊపి ప్రారంభించారు.అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిలతో పాటు పెద్ద సంఖ్యలో జనం ర్యాలీలో పాల్గొన్నారు. హాలియాలో ఎమ్మెల్యే నోము ల భగత్ ఆధ్వర్యంలో భారీ సమైక్యతా ర్యాలీ జరిగింది. నియోజకవర్గవ్యాప్తంగా పెద్దసంఖ్యలో వివిధ వర్గాల ప్రజలు దీనికి తరలివచ్చారు. సమైక్యతా ర్యాలీల్లో జిల్లా ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు, వివిధ వర్గాల ప్రజలు, విద్యార్థ్ధులు, యువకులు, మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొనడంతో ఎక్కడ చూసినా సంద డే కనిపించింది. త్రివర్ణ పతాకాలు చేత పట్టి ర్యాలీల్లో పాల్గొనడంతో చూపరులను ఎంతో ఆకట్టుకుంది.
ర్యాలీలు, సభలకు తరలివచ్చిన ప్రతీ ఒక్కరికీ ప్రభు త్వం ఆధ్వర్యంలోనే మధ్యాహ్నా భోజనం ఏర్పాటు చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఒక్కో కేంద్రంలో కనీసం 15వేల మందితో వీటిని నిర్వహించాలని భావించగా చాలా చోట్ల 20వేలకు పైబడే ప్రజలు పాల్గొని సమైక్యతా వజ్రోత్సవ వేడుకులకు జై కొట్టారు. ఇండియన్ యూనియన్‌లో తెలంగాణ ప్రాంతం కలిపిపోయి 75 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా చరిత్రను తప్పుదోవ పట్టించేలా జరుగుతున్న కుట్రలను తేటతెల్లం చేసేందుకు సీఎం కేసీఆర్ తలపెట్టిన సమైక్యతా వేడుకలకు ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన లభిస్తుండడం విశేషం.
నేడు జాతీయ పతాక ఆవిష్కరణ
వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం 9గంటలకు నల్లగొండ జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్స్ లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, సూర్యాపేటలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, భువనగిరిలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగరవేయనున్నారు. వీటిల్లో ఆయా జిల్లాల ఎం పీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొననున్నారు. ఇక అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు జిల్లా, మండల పరిషత్, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లోనూ జాతీయ పతాకాన్ని ఎగరవేసేలా ప్రభుత్వం ఆదేశాలివ్వడంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేశారు.