నల్లగొండ, సెప్టెంబర్ 12: మిర్యాలగూడలో ఒక అమ్మాయికి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. అదే పనిగా మెసేజ్‌లు చేస్తున్నాడు. మానసికంగా కుంగిపోయిన బాధితురాలు షీటీమ్‌ను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు మొబైల్ నంబర్ ఆధారంగా లొకేషన్ ట్రేస్ చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. కౌన్సెలింగ్ ద్వారా అమ్మాయికి ధైర్యం చెప్పి, మునుపటి స్థితికి తీసుకొచ్చారు.
మహిళా రక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన షీటీమ్స్ సమర్థవంతంగా పని చేస్తున్నాయి. స్కూళ్లు, కాలేజీలు, బస్టాండ్లు, రద్దీ ప్రాంతాల్లోనే గాక మొబైల్ ఫోన్లు, ఆన్లైన్లో వేధింపులకు పాల్పడుతున్న వారి ఆటను కట్టిస్తున్నాయి. బాధితులు ధైర్యం చేసి ఒక్క కంప్లయింట్ ఇస్తే.. నిందితులను వెంటాడి కటకటాల్లోకి నెడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు నల్లగొండ జిల్లాలో షీ టీమ్ పోలీసులకు 274 ఫిర్యాదులు రాగా, తీవ్రతను బట్టి 41 కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరో 78 పిటీ కేసులు పెట్టారు. సోషల్ మీడియా ద్వారా బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించి జాగ్రత్తలు చెప్తున్నారు. విద్యార్థినులు, మహిళలు సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ రెమారాజేశ్వరి సూచించారు.
జిల్లా వ్యాప్తంగా మహిళా రక్షణ కోసం ఏర్పడినటువంటి షీటీమ్ నిత్యం నిఘా పెడుతూ వారికి అండగా ఉంటున్నది. జిల్లాలో నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ సబ్ డివిజన్లలో సీఐస్థాయి అధికారితో బృందం ఏర్పాటు చేయగా ఆయా బృందాలు మహిళల రక్షణ కోసం ముందుకు సాగుతున్నాయి. బాలికలు, యువతులు, మహిళలను ఇబ్బంది పెట్టే ఆకతాయిలను కటకటాల్లోకి పంపిస్తున్నాయి షీటీమ్ బృందాలు. ప్రతి ఏటా కనీసం 300 మేరకు జిల్లా వ్యాప్తంగా ఫిర్యాదులు అందుతుండగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని సాధ్యమైనంత త్వరగా కేసులు పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నాయి ఈ బృందాలు.
ఈ ఏడాది జనవరి నుంచి 274 ఫిర్యాదులు..
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలోని ఆయా షీ టీమ్స్ కార్యాలయాలకు మొత్తం 274 ఫిర్యాదులు అందాయి. అందులో 41 ఫిర్యాదులకు సంబందించి ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. మరో 78పై కేసులు మోదయ్యాయి. 250 ఫిర్యాదుల్లో సందర్భాన్ని బట్టి కౌన్సిలింగ్ ఇవ్వడం, మరికొన్ని వార్నింగ్స్‌తో సెటిల్ చేశారు. మొత్తం కేసుల్లో మైనర్స్‌కు సంబంధించి 32 కాగా మేజర్లకు సంబంధించి 218. పలువురి ఫిర్యాదులతో 26 మంది ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని శిక్షించాయి షీటీమ్ బృందాలు.