యాదాద్రి, సెప్టెంబర్ 12 : యాదాద్రి లక్ష్మీనర్సింహుడి దివ్యక్షేత్రంలో స్వామి, అమ్మవార్ల నిత్యోత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామిని మేల్కొల్పిన అర్చకులు తిరువారాధన నిర్వహించి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టారు. స్వామి, అమ్మవార్లకు ఉదయం సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం చేశారు. అనంతరం వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం ఘనంగా జరిపించారు. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలను అత్యంత వైభవంగా నిర్వహించారు. కొండకింద దీక్షాపరుల మండపం వద్ద గల వ్రత మండపంలో సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి.
రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం
సోమవారం కావడంతో పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వరాలయంలో లింగేశ్వర కుటుంబంతో పాటు ఆలయంలో నూతనంగా ప్రతిష్ఠించిన స్పటిక లింగేశ్వరుడికి ప్రభాతవేళ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని సుమారు గంటన్నర పాటు జరిపారు. సాయంత్రం రామలింగేశ్వరుడికి సేవను శివాలయ మాఢవీధుల్లో ఊరేగించారు. సుమారు 11,632 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలుపుకుని స్వామివారి ఖజానాకు రూ.13,39,416 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.