రాష్ట్రంలో వివిధ శాఖల్లో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు అండగా నిలుస్తున్నది. తెలంగాణ ఉద్యమంలో వెన్నంటి నిలిచిన ఉద్యోగులకు గుర్తింపుగా సీఎం కేసీఆర్ వేతనాలు భారీగా పెంచారు. 2015లో 43శాతం, 2020లో 30 శాతం పీఆర్సీతోపాటు ఇంక్రిమెంట్ల వల్ల వేతనాలు రెట్టింపయ్యాయి. దీనికి తోడు కొత్త ఉద్యోగాలు ఎప్పటికప్పుడు భర్తీ చేయడంతో అన్ని శాఖలు కళకళలాడుతున్నాయి. కొత్త జిల్లాలు, మండలాలు, పంచాయతీలను ఏర్పాటు చేయడంతో ఉద్యోగులకు పనిభారం తగ్గింది. కొత్త జోనల్ వ్యవస్థతో ఉద్యోగులు స్థానికంగా విధులు నిర్వహించే అవకాశం లభించింది. కొత్త ఉద్యోగాలూ ఎక్కడివారికి అక్కడే వస్తున్నాయి. ఇక ప్రధాన పండుగలకు రెండు రోజులు సెలవు ఇస్తుండడంతో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతున్నారు. రాష్ట్రంలో ఉద్యోగులు పొందుతున్న వేతనాలు, సౌకర్యాలతోపాటు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను దేశంలోని ఇతర రాష్ర్టాల ఉద్యోగులు కోరుకుంటున్నారు. ఇవన్నీ అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
– సూర్యాపేట, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ)
స్వరాష్ట్రంలో అన్ని వర్గాలతోపాటు ప్రభుత్వ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం కడుపులో పెట్టుకొని చూసుకుంటూ ఫ్రెండ్లీ సర్కారుగా నిలిచింది. పాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు, మండలాలు, పంచాయతీలను ఏర్పాటు చేసి ప్రజలకు పాలన చేరువ చేసింది. ఉద్యోగులకు పని భారం తగ్గించింది. కొత్త జోనల్ వ్యవస్థతో ఉద్యోగులు సొంతూర్లకు దగ్గర్లో విధులు నిర్వహించే అవకాశం కల్పించింది. సబ్బండ వర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టగా.. ఉద్యోగుల కృషితో అర్హులైన లబ్ధిదారులకు పక్కాగా అందుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో ఉద్యోగులు పొందుతున్న లబ్ధి, అవకాశాలను ఇతర రాష్ర్టాల ప్రజలు కోరుతున్నారు. ఇందుకోసం కేసీఆర్ వంటి నేతలు దేశ రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు.
ప్రస్తుత ప్రభుత్వంలో ఉద్యోగులకు ఎంతో మేలు జరుగుతుండడంతోపాటు అభివృద్ధి ఫలాలు 60నుంచి 80 శాతం ఉద్యోగులకు దక్కుతుండడంతో వారిలో ఎనలేని సంతోషం కనిపిస్తున్నది. నీళ్లు, విద్యుత్తు, రహదారులు బాగుపడడంతో సాగు, భూముల ధరలు పెరిగి అన్ని వర్గాలు ఆర్థికంగా బలపడ్డాయి. ఇలాంటి సీఎం జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే దేశం బాగుపడడం ఖాయమని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కట్లు, చాలీచాలని వేతనాలు, పని ఒత్తిడిని అనుభవించిన ఉద్యోగులు.. స్వరాష్ట్రంలో కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతోపాటు అన్నీ ఇస్తుండడంతో ఎంతో సంతోషంగా ఉన్నామని పేర్కొంటున్నారు. ఇలాంటి విధానాలు దేశం మొత్తం అమలు కావాలని కోరుతున్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం ఏ ఆకాంక్షలతో ఉద్యమం చేశామో ఇప్పడవన్నీ నెరవేరాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమ ఫలాలను ఎంజాయ్ చేయడంతోపాటు దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో భాగస్వాములం అవుతుండడం సంతోషాన్నిస్తుందని పలువురు ఉద్యోగులు పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లో ఉంటే దేశం అభివృద్ధిపథంలో పయనిస్తుందని, పేదలందరికీ తెలంగాణ వంటి పథకాలు అందుతాయని కోరుతున్నారు.
స్వరాష్ట్రంలో అన్ని వర్గాలతోపాటు ఉద్యోగులకు వరాలను అందించిన మహోన్నత వ్యక్తి సీఎం కేసీఆర్. ముఖ్యంగా ఉద్యోగుల విరమణ వయస్సును 61సంవత్సరాలకు పెంచడం, 30శాతం ఫిట్మెంట్, డీఏ ఇతర అంశాల్లో ఎంతో ఆదరణ చూపారు. ప్రస్తుతం 80వేలకు పైగా ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే పోలీసు నోటిఫికేషన్ విడుదల చేయగా, త్వరలోనే మరిన్ని నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. దీంతో నిరుద్యోగుల ఆకాంక్ష నెరవేర్చుతున్నారు. ఫ్రెండ్లీ గవర్నమెంట్‌గా కీర్తిలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలు అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రం సాధించడంతోపాటు తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుతున్నారు. ఆయన జాతీయ స్థాయిలో రాణిస్తే మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశ ప్రజలందరికీ అందుతాయి. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లడం సంతోషించదగ్గ విషయం. రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఆయన.. జాతీయ స్థాయిలో ఉన్నతమైన పదవిలో ఉండి దేశ ప్రజలందరికీ లబ్ధి చేకూర్చాలని కోరుతున్నా. ఉన్న వనరులను ఎలా సద్వినియోగం చేసుకోవాలో సీఎం కేసీఆర్‌కు బాగా తెలుసు. అందుకు నిదర్శనం కాళేశ్వరం ప్రాజెక్టు.
– శ్రవణ్‌కుమార్, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు, నల్లగొండ
భారతదేశం అభివృద్ధిలో చాలా వెనుకబడి ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలను విస్మరిస్తున్నది. ప్రజల హక్కులను కాలరాస్తున్నది. ప్రధానమంత్రి మోదీ ఎన్నికల సమయంలో పాకిస్థాన్, చైనా యుద్ధ్దాలంటూ ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వ్యవసాయం, ఉపాధి రంగాలకు ప్రోత్సాహకం లేకపోవడంతో దేశ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ దిగజారిపోతున్నది. ఈ క్లిష్ట సమయంలో సీఎం కేసీఆర్ వంటి గొప్ప రాజనీతజ్ఞుడు దేశానికి అవసరం. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే దేశాభివృద్ధి సాధించడంతోపాటు ప్రజలంతా బాగుపడుతారు. అపర చాణిక్యుడైన కేసీఆర్ రాజకీయాల్లో ఎన్నో విజయాలను సాధించారు. ఆరున్నర దశాబ్దాల తెలంగాణ ఉద్యమ పోరుకు తన నాయకత్వంలో ఒక రూపు తీసుకొచ్చారు. ఆయనకు జాతీయ, అంతర్జాతీయ, సమకాలీన అంశాలతోపాటు చరిత్రపై మంచి అవగాహన ఉంది. ముఖ్యంగా దక్షిణాది నాయకుల్లో కేసీఆర్‌కు మాత్రమే హిందీ భాషపై మంచి పట్టు ఉండడం గొప్ప వరం. అన్ని అర్హతలున్న కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రాణిస్తారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు తరవాత పరిపాలన అనుభవం కలిగిన సమర్థవంతమైన నాయకుడు కేసీఆర్. ఇప్పటికే రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, ఆరోగ్యశ్రీ, ఆసరా ఫించన్లు వంటి పథకాలు దేశానికి దిక్సూచిగా నిలిచాయి. మొదటి నుంచీ కేసీఅర్ ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షపాతి. అన్ని అర్హతలు కలిగిన కేసీఆర్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగి ప్రధాని అయ్చే అవకాశం ఉంది. ఇది దేశానికి అవసరం కూడా.
– కొంపెల్లి మత్స్యగిరి, వైద్యారోగ్య శాఖ ఉద్యోగి, నల్లగొండ
పోరాడి సాధించిన తెలంగాణ రాష్ర్టాన్ని అతి తక్కువ సమయంలో దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దిన దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్. దేశ నాయకత్వానికి ఆయనే సరైనోడు. సమైక్య పాలనలో అన్ని విధాలుగా ఆగమై అభివృద్ధిలో వెనుకబడిన తెలంగాణను ఎనిమిదేండ్లలోనే ఎవరూ ఊహించని రీతిలో ప్రగతి సాధించారు. వినూత్న పథకాలను ప్రవేశపెట్టారు. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి అన్ని వర్గాల ప్రజలతోపాటు ఉద్యోగులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. గతంలో సమస్యల పరిష్కారానికి ధర్నాలు, రాస్తారోకోలు చేసినా పాలకులు పట్టించుకోని ఘటనలు ఎన్నో చూశాం. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎనిమిదేండ్లుగా ధర్నాలు, రాస్తారోకోల అవసరం లేకుండా వినతుల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతున్నాయి. రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒకరిని మంచి మరొకరు అన్నట్టుగా దేశాన్ని ఆగం చేయడంతో ప్రస్తుతం దేశ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఇటువంటి పరిస్థితిలో సీఎం కేసీఆర్‌తోనే దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని ప్రజలంతా విశ్వసిస్తున్నారు. నిరంతర అభివృద్ధి కాముకుడు దేశ రాజకీయాల్లో ఉంటే మన దేశం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచేలా ప్రగతి సాస్తుందని అభివృద్ధి అవుతుందని అంతా ఎదురుచూస్తున్నారు. యావత్ దేశంలోని అన్ని ప్రాంతాలపై పూర్తి అవగాహన ఉన్న నాయకుడు, ప్రజా సేవకుడు, పేదల పక్షపాతి కేసీఆర్ త్వరగా దేశ రాజకీయాల్లో అడుగుపెట్టి సంచలనం సృష్టించాలి.
– మాండన్ సుదర్శన్, వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సూర్యాపేట
ప్రతి వర్షపు నీటిని ఒడిసి పట్టి మందస్తు ప్రణాళికలతో సద్వినియోగం చేయగల వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రతి ప్రాజెక్టులో ఎంత నీరు నిల్వ ఉంటుంది.. ఆ నీటిని ఎప్పుడు ఏవిధంగా ఉపయోగించాలి. అనే అంశాలను అధికారులకు ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ పంట పొలాలకు, విద్యుత్‌కు నిరంతరం నీరు అందేలా కృషి చేస్తారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి వరద చేరుతుండగానే రైతాంగం కోసం ముందుగానే పంట పొలాలకు నీటిని విడుదల చేయిస్తారు. శ్రీశైలం రిజర్వాయర్‌లోకి వరద నీరు ప్రారంభం కావడంతోనే విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తారు. ఈ విధమైన ప్రణాళికలతో రాష్ట్రంలో నిరంతర విద్యుత్‌తోపాటు రెండు పంటలకు నీళ్లు అందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టు పరిధిలోని రైతులకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో రెండు పంటలకు నీళ్లు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే. డ్యామ్ నిర్మాణం నుంచి నిరుపయోగంగా ఉన్న రివర్సబుల్ విద్యుత్ ఉత్పత్తిని పునఃప్రారంభించి నిరంతర విద్యుత్ ఉత్పత్తి చేపడుతున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణాల ద్వారా బీడు భూములను సస్యశ్యామలం చేయడానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి వేల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నారు. రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మారుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తే.. దేశం, రాష్ట్రం మరితం అభివృద్ధి పథంలో పయనిస్తాయి.
సీఎం కేసీఆర్ వంటి నాయకులు దేశ రాజకీయాల్లో ఎంతో అవసరం. ఆయన విజన్ ఉన్న నాయకుడు. అన్ని రంగాలపై అపారమైన అవగాహన ఉన్న నేత. అలాంటి నేత దేశానికి మార్గదర్శకుడు అవుతాడు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది. ఆయన ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. నేను ఎంఏ, ఎంఈడీ చదువుకున్న. 2018లో ఎస్డబ్ల్యూఓగా ఉద్యోగం వచ్చింది. పైసా లంచం లేకుండా ఉద్యోగం రావడం సంతోషకరం. నాలాంటి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో నిరుపేదలతోపాటు అన్ని రంగాల్లో పనిచేస్తున్న వారిని ఆదుకుంటున్న నేత సీఎం కేసీఆర్. దేశంలో ఎన్నో రకాల వనరులున్నాయి.. వాటిని ఉపయోగించుకుంటే దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది. తెలంగాణలో ఫ్రెండ్లీ ఉద్యోగ విధానం కొనసాగుతుంది. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మంచి అవకాశం కల్పించారు. ఇలాంటి విధానం దేశవ్యాప్తంగా కొనసాగాలంటే సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లాలి. తెలంగాణ విధానాన్ని దేశం అంతా కోరుకుంటుంది.
– తోట నరేశ్, ఎస్సీ హాస్టల్ వార్డెన్, దామరచర్ల
రాష్ట్రంలో వినూత్న పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల వైపు దృష్టి సారించడం శుభసూచకం. ఎనిమిదేండ్లలో తెలంగాణను అభివృద్ధిపథంలో నడిపిన ఆయన అవసరం నేడు దేశానికి ఎంతో ఉంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ప్రగతిలో దూసుకెళ్తూ దేశానికే మార్గదర్శకంగా నిలుపడం, దేశానికి అన్నం పెట్టే స్థాయికి చేరడం గర్వించదగ్గ విషయం. జాతీయ స్థాయిలో ఆయన ఉంటే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రపంచ దేశాలు గర్వించేలా భారతదేశాన్ని నిర్మిస్తారన్న నమ్మకం ఉంది. దేశంలోని రైతుల కష్టాలు తీరాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టాల్సిందే. భారతదేశ పరిస్థితులపై సీఎం కేసీఆర్‌కు స్పష్టమైన అవగాహన ఉంది. కేసీఆర్ వంటి నాయకుడు వస్తే దేశ పురోగతి సాధ్యమవుతుంది. హిందీ భాషపై మంచి పట్టుండడం ఆయనకు గొప్ప వరం. అన్ని అర్హతలు, అనుభవం ఉన్న కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రాణిస్తారు.
– బొల్లెపల్లి శంకరయ్య, పంచాయతీ కార్యదర్శి, తిర్మలరాయినిగూడెం, శాలిగౌరారం మండలం
ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్లడం మంచి పరిణామం. ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించి అభివృద్ధిలో తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా నిలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎవ్వరూ సాటిలేరు. దేశంలోని అన్ని భాషలు మాట్లాడడంలో ఆయన మంచి ప్రావీణ్యుడు. ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడం కేసీఆర్‌కే సాధ్యం. ఎనిమిదేండ్ల పాలనలో అద్భుత ఫలితాలు సాధించారు. ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు తెలంగాణ అభివృద్ధి వైపు చూస్తున్నారు. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ వెళ్తేనే దేశంలో సమూల మార్పులు వస్తాయి. ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఇప్పటికే జాతీయ రాజకీయాలకు వెళ్తున్న విషయంపై పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులు కూడా ఆశీర్వదించారు. కేంద్రంలో మార్పు ఎంతో అవసరం. అది ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే సాధ్యం.
– హన్మంత్ వెంకటేశ్‌గౌడ్, రెవెన్యూ ఉద్యోగి, దేవరకొండ
ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేసి కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తే దేశ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు చూసి దేశంలోని అన్ని రాష్ర్టాల ప్రజలు మాకు కావాలని ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో కేసీఆర్ దేశ రాజకీయాలపై దృష్టి పెట్టడం శుభ పరిణామం. కేసీఆర్ వంటి వ్యక్తి జాతీయ రాజకీయాల్లో ఉంటే దేశ వ్యాప్తంగా రైతులకు మంచి జరుగుతుంది. జాతీయ రాజకీయాల్లో సక్సెస్ అయితే.. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, ఉచిత విద్యుత్ వంటి పథకాలు దేశ వ్యాప్తంగా అమలవుతాయి. తెలంగాణ ఏర్పడిన 8ఏండ్లలోనే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది. పరిపాలన సౌలభ్యం కోసం తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి అభివృద్ధి పరిచారు. కేసీఆర్ రాజకీయాల్లోకి రావాలని దేశ వ్యాప్తంగా రైతులు కోరుతున్నారు.
– లాజరస్, చిట్యాల ఎండీడీఓ
ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి సీఎం కేసీఆర్ నాయకత్వం ఎంతో అవసరం. తెలంగాణ రాష్ర్టాన్ని పరిపాలిస్తున్న విధానాన్ని చూసి దేశం మొత్తం నివ్వెర పోతూ ఉంది. సంక్షేమ పథకాల రూపకల్పనలో ఆయనకు ఎవరూ సాటి లేరు. దేశంలోని ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించగల సమర్థ్ధ నాయకుడు కేసీఆర్ మాత్రమే. కుల, మత భేదాలు లేకుండా ప్రజా సంక్షేమయే ధ్యేయంగా పాలించే తీరు ఆయనకు సొంతం. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ప్రవేశం అనేక మార్పులకు నాంది అవుతుంది. దేశంలోని యువతకు ఉపాధి, ఉద్యోగాల కల్పన.. జాతీయ ఆదాయం పెంచేందుకు కేసీఆర్‌కు ప్రత్యేక విజన్ ఉంది. రైతులకు ఉచిత విద్యుత్, సాగునీరు అందించడానికి కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించి ప్రజల జీవన ప్రమాణస్థాయిని మెరుగు పరిచేందుకు కేసీఆర్ కృషి చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉంది. ఆయన రాకతో దేశ ప్రజలు మరో స్వర్ణయుగాన్ని చూస్తారు.
– కొణతం శ్రీనివాస్‌రెడ్డి, మండల పశువైద్యాధికారి, హుజూర్నగర్
తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావడం శుభ పరిణామం. తెలంగాణలో రైతులకు ఉచిత కరెంట్‌ను ప్రవేశపెట్టారు. దేశంలోని అన్ని రాష్ర్టాల్లో ఉచిత కరెంట్ ప్రవేశపెడితే రైతుకు లాభదాయకంగా ఉంటుంది. పేదల కష్టాలు తెలిసిన నాయకుడు జాతీయ రాజకీయాల్లో ఉంటే దేశ ప్రజలకు మేలు జరుగుతుంది. తెలంగాణలో వినూత్న పథకాలు ప్రవేశపెట్టి పేదలకు అండగా నిలిచిన సీఎం కేసీఆర్‌తో దేశం ప్రగతి పథంలో పయనిస్తుంది.
– భీమ్సింగ్నాయక్, తుంగతుర్తి ఎంపీడీఓ
సీఎం కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడు. దేశాన్ని అన్నివిధాలా అభివృద్ధి పథంలో నడిపించగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అందుబాటులో ఉన్న వనరుల ద్వారా సంపదను సృష్టించి పేదలకు సంక్షేమ పథకాల రూపంలో అందజేయాలనే తపన కలిగిన వ్యక్తి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఎనిమిదేండ్ల పాలనలో రైతులు, కార్మికులు, వృద్ధులు, చేతి వృత్తులు, దళితులకు మేలు కలిగించే పథకాలను అమలు చేశారు. రాష్ట్రంలో అన్ని క్యాడర్లలో ఉన్న ఉద్యోగులకూ వేతనాలు పెంచడంతోపాటు ఇతర సౌకర్యాలు కల్పించడంతో ఆత్మ విశ్వాసం, గౌరవం పెరిగింది. ప్రభుత్వ దవాఖానల అభివృద్ధి, పల్లె దవాఖానల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పనకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. కార్పొరేట్ స్థాయిలో సర్కారు దవాఖానల్లో వైద్యం అందుబాటులోకి వచ్చింది. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తే ఇతర రాష్ర్టాల ఉద్యోగులందరికీ మేలు కలుగుతుంది.