యాదాద్రి, సెప్టెంబర్11: దేశానికి సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. బొమ్మలరామారం మండలం కంచల్ తండాకు చెందిన ధరావత్ రమేశ్‌నాయక్ ఆధ్వర్యంలో 200 మంది కాంగ్రెస్ నాయకులు, ఆలేరు మండలం మందనపల్లికి చెందిన బండి భిక్షపతి, చంద్రయ్య ఆధ్వర్యంలో 50 మంది, కాంగ్రెస్ యువజన నాయకుడు నోముల నవీన్ ఆధ్వర్యంలో 100 మంది యువకులు యాదగిరిగుట్ట పట్టణంలో మహేందర్‌రెడ్డి సమక్షంలో ఆదివారం టీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రం లో బీజేపీని కూకటి వేళ్లతో పీకేయాలని చెప్పారు. బీజేపీ ముక్త్ భారత్ కావాలన్నారు. దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ వస్తానని ప్రకటించడంతో బీజేపీ ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలతో దాడులు చేసి భయపెట్టాలని చూస్తున్నదని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని బీజేపీ చూస్తున్నదని ఆరోపించారు. అన్ని రాష్ర్టాల రైతులు సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నట్లు వివరించారు. రాజ్యాంగ బద్ధంగా వచ్చే నిధులను కూడా కేంద్రం రాష్ర్టానికి ఇవ్వడం లేదన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని చెప్పారు.సీఎం కేసీఆర్ అంటే మోదీకి వణుకు మొదలైందని తెలిపారు. కేసీఆర్ ముందుచూపుతో రాష్ర్టాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు.
ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్ఎస్లోకి చేరికల జోష్ కొనసాగుతున్నది, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జై కొడుతూ వివిధ పార్టీల సీనియర్ నాయకులు, యువకులు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు వివరించారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్ అడుగీడుతున్న సందర్భంలో టీఆర్ఎస్లోకి చేరికలు శుభ సూచకమని అన్నారు. దేశంలో రాబోయేది కేసీఆర్ పాలనేనని ధీమా వ్యక్తం చేశారు. కొత్త, పాత పార్టీ నాయకులు సమన్వయంతో క్యాడర్ పనిచేయాలని సూచించారు.నియోజకవర్గ వ్యాప్తంగా ఎంతో మంది నాయకులు తమతో టచ్‌లో ఉన్నారని, వారందరూ పార్టీలోకి చేరబోతున్నారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీతో దేశానికి ఒరిగేది శూన్యమన్నారు. రాష్ట్రంలో మూడోసారి టీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందని వెల్లడించారు.
కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, బొమ్మలరామారం టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పొలగాని వెంకటేశ్‌గౌడ్, సెక్రటరీ జనరల్ గుర్రాల లక్ష్మారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ గూదె బాలనర్సయ్య, భువనగిరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సత్యనారాయణ, జిల్లా నాయకులు రాజన్ నాయక్, మచ్చ శ్రీనివాస్‌గౌడ్, వైస్ ఎంపీపీ చంద్రమౌళి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎనుగు కొండల్‌రెడ్డి, సర్పంచులు గణేశ్, బీరప్ప, నవీన్, నాయకులు రామకృష్ణ, లింగానాయక్, ఆలేరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గ్యాదపాక నాగరాజు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంగుల శ్రీనివాస్‌యాదవ్, సర్పంచ్ కోటగిరి పాండరిగౌడ్, ఉప సర్పంచ్ సత్యనారాయణ, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు సుంచు మహేందర్ పాల్గొన్నారు.