అభివృద్ధి చేస్తాడని నమ్మి ఓట్లేస్తే, మధ్యలోనే కాడెత్తేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై మునుగోడు నియోజకవర్గ ప్రజలు భగ్గుమంటున్నారు. కాంగ్రెస్‌కు హ్యాండ్ ఇచ్చి, ఈసారి బీజేపీ కండువాతో వస్తున్న ఆయన్ని అడుగడుగునా అడ్డుకుంటున్నారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీల సంగతేందని నిలదీస్తున్నారు. కపట నాటకాలు, కల్లబొల్లి మాటలు కట్టిపెట్టాలని అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఈ నెల 6న నాంపల్లి మండలం తుంగపహాడ్ గ్రామస్తులు అడ్డుకోగా, తాజాగా సంస్థాన్‌నారాయణపురం మండలం మర్రిగూడెం గ్రామస్తులు చుక్కలు చూపించారు. గత ఎన్నికల్లో సొంత డబ్బుతో సీసీ రోడ్లు, వాటర్ ప్లాంట్ ఏర్పాటుచేస్తానంటూ ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. మూడేండ్ల నుంచి కనిపించకుండా ఇప్పుడెందుకు వచ్చావ్? అంటూ కడిగిపారేశారు. కంగుతున్న రాజగోపాల్‌రెడ్డి పొంతలేని సమాధానం చెప్పబోయినా వినకపోవడంతో విసుగ్గా అక్కడినుంచి జారుకున్నాడు. దాంతో మళ్లొకసారి మా ఊరికి వస్తే మర్యాద దక్కదంటూ గ్రామ మహిళలు హెచ్చరించడం గమనార్హం.
చౌటుప్పల్, సెప్టెంబర్ 10: ‘మూడేండ్లు అయ్యింది.. ఇంత వరకు మా ఊళ్లోకి రాలేదు. గత ఎన్నికలో ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదు.’ అని మునుగోడు నియోజకవర్గ ప్రజలు బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని నిలదీశారు. దాంతో సమాధానం చెప్పలేక రాజగోపాల్‌రెడ్డి తోక ముడుస్తున్నారు. సంస్థాన్‌నారాయణ పురం మండలంలోని సర్వేల్ గ్రామ పంచాయతీ పరిధిలోని మర్రిగూడెం గ్రామంలో వినాయక విగ్రహం వద్ద శుక్రవారం రాత్రి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనేందుకు రాజగోపాల్‌రెడ్డి వచ్చారు.
ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు గ్రామంలో సొంత నిధులతో సీసీ రోడ్లు, వాటర్ ప్లాంట్ నిర్మిస్తానని హామీ ఇచ్చి ఇప్పటి వరకు గ్రామానికి రాలేదని, ఇప్పుడు ఎందుకు వచ్చారని గ్రామస్తులు ఆయన్ని అడ్డుకున్నారు. గత ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డి మండలకేంద్రంలోని ఫలక్నామ కాలనీ వాసులతో సమావేశం ఏర్పాటు చేసి తనను గెలిపిస్తే ప్రధాన ద్వారం వద్ద ఆర్చి నిర్మిస్తానని హామీ ఇచ్చారు.
శుక్రవారం కాలనీలో గణేశ్ శోభాయాత్రకు రాగా ఎందుకు వచ్చారని కాలనీవాసులు నిలదీశారు. అలాగే ఇటీవల నాంపల్లి మండలం తుంగపహాడ్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రాజగోపాల్‌ను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఏం అభివృద్ధి పనులు చేశావో చెప్పాలని డిమాండ్ చేయగా సమాధానం చెప్పలేక వెనుదిరిగారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు ప్రశ్నిస్తూ ఎక్కడికక్కడ అడ్డుకుంటుండడంతో రాజ్‌గోపాల్‌రెడ్డి బిత్తర పోతున్నారు.