నిడమనూరు, సెప్టెంబర్ 8 : నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు సమీపంలోని నాగార్జున సాగర్ ఎడమ ప్రధాన కాల్వకు 32.109వ కిలోమీటరు వద్ద పడిన గండి పూడ్చివేత పనులను అధికారులు ముమ్మరం చేశారు. అండర్ టన్నెల్లో ఏర్పడిన రంద్రానికి నీటి ప్రవాహ ఉధృతి తోడవడంతో గురువారం సాయంత్రం కాల్వ కట్ట కోతకు గురైన సంగతి తెలిసిందే. గండి ద్వారా ప్రవహించిన నీరు పొలాలను ముంచెత్తింది. నిడమనూరు, నర్సింహులగూడెం గ్రామాలు జలదిగ్బందంలో చిక్కుకోగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రధాన రహదారిపై నర్సింహులగూడెం వద్ద ఏడు ఫీట్ల మేర వరద నీరు ప్రవహించడంతో పోలీసులు రాకపోకలు నిలిపివేసి వాహనాలను దారి మళ్లించారు.
75 నుంచి 100 అడుగుల మేర గండి..
సుమారు 75 నుంచి 100 అడుగుల మేర గండి పడినట్లు ఎన్ఎస్పీ అధికారులు అంచనా వేశారు. అయితే మూడు రోజులుగా కాల్వ కట్ట కింది భాగం నుంచి లీకేజీ నీరు ప్రవహించినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. రంధ్రం క్రమేపీ పెద్దదై కాల్వ కట్ట కోతకు గురైందన్నారు. నీటి సరఫరా పర్యవేక్షణను పట్టించుకోని కారణంగానే భారీ నష్టం చవిచూడాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
రెండు గ్రామాలపై వరద ప్రవాహం..
నిడమనూరు, ఆవాస గ్రామం నర్సింహులగూడెంపై గండి తీవ్ర ప్రభావం చూపింది. వరద నీరు ఇళ్లలోకి పెద్ద ఎత్తున చేరడంతో కట్టుబట్టలతో తరలాల్సిన పరిస్థితి నెలకొంది. స్థానిక యువకుల సాయంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నిడమనూరు వైకుంఠ ధామం వద్ద ప్రధాన రహదారి భారీ కోతకు గురైంది. రాకపోకలు నిలిపివేయడంతో ప్రాణాపాయం తప్పింది.
గండి ప్రదేశాన్ని పరిశీలించిన సీఎం ఓఎస్డీ
సాగర్ ఎడమ కాల్వపై గండి పడిన ప్రదేశాన్ని సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే నేతృత్వంలోని అధికారుల బృందం చీఫ్ ఇంజినీర్ శ్రీదేవి, ఎన్ఎస్పీ సీఈ శ్రీకాంతరావు, ఎస్ఈ ధర్మా, ఈఈ లక్ష్మణ్‌రావు నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్‌తో కలిసి గురువారం పరిశీలించింది. గండి ముందు భాగంలో ఇసుక మేట తీరుపై, ప్రమాదానికి కారణాలపై సీఎం ఓఎస్డీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన గండి పూడ్చివేతకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ సందర్భంగా పంటల నష్టాన్ని అధికారుల బృందానికి ఎమ్మెల్యే వివరించారు. గండి ప్రదేశాన్ని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ సాయంత్రం సందర్శించారు. ఘటన తీరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. పంట, ఆస్తి నష్టం వివరాలపై ఆరా తీశారు. త్వరితగతిన గండి మరమ్మతు పనులను పూర్తి చేయాలని ఎన్ఎస్పీ అధికారులకు సూచించారు.
200 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు..
గండి ప్రదేశాన్ని జేడీఏ సుచరిత, విద్యుత్ ఎస్ఈ చంద్రమోహన్ పరిశీలించారు. ప్రాథమికంగా 200 ఎకరాల్లో పంట నష్టం వాటినట్లు గుర్తించామని జేడీఏ తెలిపారు. క్షేత్రస్థాయిలో నష్టం అంచనాలను సేకరించి నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని చెప్పారు. విద్యుత్ స్తంభాలు 20, ట్రాన్స్‌ఫార్మరు ్ల 10, ఎల్టీ విద్యుత్ లైన్ నేల మట్టమవడంతో సుమారు రూ.25 లక్షల మేర నష్టం సంభవించినట్లు ఎస్ఈ తెలిపారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన చేపడుతున్నట్లు వెల్లడించారు.
ఏఎస్ఐ చొరవతో తప్పిన ప్రాణ నష్టం..
నిడమనూరు ఏఎస్ఐ జోజి చొరవతో మినీ గురుకులం విద్యార్థినులకు ప్రాణనష్టం తప్పింది. గండి సమాచారం అందుకున్న ఏఎస్ఐ చెరువు దిగువన లోతట్టు ప్రదేశంలో ఉన్న గురుకులం భవనంలోకి వరద నీరు వస్తున్నట్లు గ్రహించాడు. దీంతో హుటాహుటిన 87 మంది విద్యార్థినులను బయటకు తీసుకువచ్చేందుకు చొరవ చూపారు.
మరమ్మతు పనులు షురూ..
నీరు తగ్గుముఖం పట్టడంతో ఒకవైపు గండి పూడ్చివేత పనులు, మరోవైపు వరద ప్రభావానికి గురై రెండు అడుగుల మేర బురద పేరుకుపోయిన నిడమనూరు, నర్సింహులగూడెం గ్రామాల్లో సహాయక చర్యలను అధికారులు యుద్ధప్రాతిపదికన చేపట్టారు. పంచాయతీ సిబ్బంది వరద ప్రభావానికి గురైన కాలనీలను వాటర్ ట్యాంకర్లతో శుభ్రం చేసేందుకు శ్రమించారు. ఇళ్లలోని బియ్యం, సామాగ్రి పూర్తిగా తడిసిపోవడంతో పంచాయతీ కార్యదర్శి లింగయ్య కాలనీ వాసులకు భోజనం, తాగునీటి వసతి ఏర్పాటు చేశారు. ప్రధాన కాల్వలోకి హిటాచీ యంత్రాలను దించేందుకు అధికారులు ర్యాంపు ఏర్పాటు పనులు ప్రారంభించారు. రోడ్డు మరమ్మతు పనుల ప్రారంభంతో గురువారం తెల్లవారుజాము నుంచి వాహనాల రాకపోకలను పోలీసులు ఒకవైపు నుంచి పునరుద్ధరించారు. మిర్యాలగూడ ఆర్డీఓ రోహిత్‌సింగ్, డీఎస్పీ వై. వెంకటేశ్వర్రావు దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించారు.
బాధితులను ఆదుకుంటాం
గండి నేపథ్యంలో అకాల వరదతో నష్టపోయిన వారిని ఆదుకుంటాం. గండి ప్రదేశం, నర్సింహులగూడెం, నిడమనూరు గ్రామాల్లో ముంపు ప్రాంతాలను పరిశీలించా. సహాయక చర్యలకు ఆదేశించి, బాధితులకు భోజన, తాగునీటి వసతులు కల్పించాం. పంట, ఆస్తి నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుకెళ్లి సాయం అందించేందుకు కృషి చేస్తా.
– నోముల భగత్, ఎమ్మెల్యే, నాగార్జునసాగర్