నిడమనూరు, సెప్టెంబర్ 7 : నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు గ్రామం వద్ద నాగార్జునసాగర్ ఎడమకాల్వకు బుధవారం సాయంత్రం గండి పడింది. మొదట ఎడమ ప్రధాన కాల్వ 32.109 కిలోమీటరు వద్ద అండర్ టన్నల్‌లో సన్నటి రంధ్రం ఏర్పడింది. అది క్రమేపీ పెద్దదవుతూ కాల్వ కట్ట కోతకు గురి కావడంతో సాయంత్రం 5గంటలకు గండి పడింది. సమాచారం అందుకున్న ఎడమకాల్వ డీఈ సంపత్ అక్కడికి చేరుకొని పరిశీలించారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించి సాయంత్రం 6.15 గంటలకు కాల్వకు నీటి విడుదలను నిలిపివేయించారు. క్రమంగా గండి పెద్దదవడంతో నీటి ఉధృతికి నిడమనూరు మండల కేంద్రంతో పాటు నర్సింహుగూడెం గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటితో నిండి పోయాయి. దాంతో అధికారులు అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆయా గ్రామాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. మండల కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్హాల్లో వారికి వసతి ఏర్పాటు చేశారు.
నీట మునిగిన పంటలు
ఎడమ కాల్వకు గండి పడడంతో నీరు పంట పొలాల్లోకి చేరింది. దాంతో నిడమనూరు, నర్సింహుల గూడెం గ్రామాల పరిధిలో సుమారు వెయ్యి ఎకరాలు నీట మునిగినట్లు రైతులు తెలిపారు.
రాకపోకలు బంద్
నిడమనూరు-మిర్యాలగూడ ప్రధాన రహదారిపై ఏడు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తుండడంతో పోలీసులు వాహనాల రాకపోకలను నిలిపివేయించారు. ప్రధాన రహదారిపై నీరు భారీగా ప్రవహిస్తుండడంతో నిడమనూరు, మిర్యాలగూడ, దేవరకొండ, నల్లగొండ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి వాహనాలను దారి మళ్లించారు. జిల్లా కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డి, మిర్యాలగూడ ఆర్డీఓ రోహిత్ సింగ్, మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర్రావు గండి పడిన ప్రదేశాన్ని సందర్శించి నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వారు అక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. తాసీల్దార్ ప్రమీల, హాలియా, మిర్యాలగూడ రూరల్ సీఐలు సురేశ్‌కుమార్, సత్యనారాయణ, ఎస్ఐ శోభన్‌బాబు ఘటనా స్థలంలో ఉండి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
ముంపు బాధితులను అప్రమత్తం చేశాం
నాగార్జునసాగర్ ప్రధాన ఎడమ కాల్వపై గురువారం సాయంత్రం గండి పడింది. వెంటనే నీళ్లు చేరుకునే ప్రాంతవాసులను అప్రమత్తం చేసి వాళ్లను తరలించాం. నర్సింహులగూడెం, నిడమనూరులోని మినీ గురుకులంతోపాటు 20 ఇండ్లు వరద ప్రభావానికి గురయ్యారు. వీరందరినీ సురక్షితంగా స్థానిక ఫంక్షన్ హాల్లోకి తరలించాం. హాలియా వద్ద నీటి విడుదలను ఇప్పటికే నిలుపుదల చేశాం. శుక్రవారం ఉదయం వరకు వరద ప్రభావం పూర్తిగా తగ్గనుంది. శానిటేషన్ అనంతరం గురుకుల విద్యార్థులను, ఆయా ప్రాంతాలవాసులను పంపిస్తాం.
– వినయ్ క్రిష్ణారెడ్డి, కలెక్టర్, నల్లగొండ
5 నిమిషాలు ఆలస్యమైతే పెను ప్రమాదం జరిగేది
ఐదు నిమిషాలు ఆలస్యమైతే పెను ప్రమాదం జరిగేది. అధికారులు వచ్చి విషయం చెప్పగానే వెంటనే పిల్లలను బయటకు తీసుకొచ్చాం. మేము బయటకు వచ్చిన వెంటనే హాస్టల్లోకి వరద స్టార్ట్ అయ్యింది. దేవుడి దయ వల్ల అప్పటికే మేము బయటకు వచ్చాం. కనీసం పిల్లల వస్తువులు తీసుకొచ్చేందుకు కూడా సమయం లేదు. హాస్టల్లో మొత్తం 87మంది పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం హాస్టల్లో ఐదున్నర అడుగుల మేర నీరు నిలిచింది. హాస్టల్ సామగ్రి, పిల్లల సామగ్రి, పుస్తకాలు వరద నీటిలో మునిగిపోయాయి.
-జ్యోతి, హాస్టల్ వార్డెన్,
మినీ గురుకులం, నిడమనూరు