నాంపల్లి, సెప్టెంబర్ 6 : ‘బీజేపీలో కొత్తగా చేరిన నాయకులకు నాదొక విన్నపం. పార్టీ జెండాను నమ్ముకుని పనిచేసిన నాయకులకు, కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ.. అవమాన పరుచకండి. ఎందుకంటే వాళ్లే లేకుంటే.. ఈరోజు మండలంలో పార్టీ ఉండేదా..? మీరు బీజేపీలో చేరేవారా..? అని బీజేపీ సీనియర్ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని పలువురు నాయకులు బహిర్గతంగానే సెల్ఫోన్లో స్టేటస్లు పెట్టుకున్నారు.
నల్లగొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం బీజేపీ కార్యాలయాన్ని పార్టీలోకి ఇటీవల వచ్చిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రారంభించారు. అయితే.. పార్టీ కార్యాలయానికి ఏర్పాటు చేసిన బోర్డులో జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి ఫొటో పెట్టకపోవడం, కార్యక్రమానికి ముందస్తుగా సమాచారం ఇవ్వకపోవడంతో మండల సీనియర్ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకరిద్దరు తప్ప సమావేశానికి ఎవరూ హాజరు కాలేదు. పార్టీ మండలాధ్యక్షుడు కూడా రాలేదు. మండలం నుంచి జిల్లా స్థాయి నాయకులు ఉన్నా.. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా సమావేశాలు నిర్వహించడం, ఇటీవల వచ్చిన నాయకులను స్టేజీ మీదికి పిలువడం, సీనియర్లను పిలువకపోవడం, పిలిచినా చివరలో పిలుస్తున్నరని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ సమావేశాలు, చేరికలు ఉన్నా ముందస్తు సమాచారం ఇవ్వకుండా అవమాన పరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.