నీలగిరి, సెప్టెంబర్ 6 : గుండె వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ గుండె వైద్య నిపుణుడు డాక్టర్ నరహరి సూచించారు. జర్నలిస్టుల దినోత్సవం సందర్భంగా మంగళవారం నల్లగొండలోని విశ్వహృదయ ఆస్పత్రిలో డాక్టర్ నాగేంద్రతో కలిసి జర్నలిస్టులకు ఉచిత గుండె పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వయస్సుతో సంబంధం లేకుండా మానసిక ఒత్తిడి కారణంగా ఎక్కువ మంది గుండెపోటుకు గురవుతున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వ్యామామం చేయాలని సూచించారు. సకాలంలో పరీక్షలు చేయించుకుంటే ప్రమాదం బారిన పడకుండా ఉండవచ్చని అన్నారు. తమ ఆస్పత్రిలో కార్పొరేట్‌కు దీటుగా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా 120 మంది జర్నలిస్టులు గుండె పరీక్షలు చేయించుకున్నట్లు చెప్పారు. శిబిరాన్ని డాక్టర్ రాజేశ్వరి పర్యవేక్షించారు.