నీలగిరి, సెప్టెంబర్ 6 : పోరాడ సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, వాటిని అడ్డుకునేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండలోని అశోకా గార్డెన్స్‌లో 6,23,24,43,44వార్డుల్లోని లబ్ధిదారులకు, ఎంఎస్ ఫంక్షన్ హాల్లో 3,4,5 వార్డుల్లోని లబ్ధిదారులకు కొత్త ఆసరా పింఛన్ మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీమాంధ్రుల పాలనలో అన్ని రంగాల్లో వెనుకబడ్డ తెలంగాణను సీఎం కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తూ విజయాలు సాధిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రా్రష్ట్రంలో అమలవుతున్న పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. యావత్ దేశ ప్రజలు తెలంగాణ, కేసీఆర్ వైపు చూస్తుంటే, అది గిట్టని మోదీ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్న సీఎం కేసీఆర్‌కు అండగా నిలువాలని కోరారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం పక్కన ఉన్న పార్కును మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డితో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమణాచారి, వైస్ చైర్మన్ రమేశ్, కౌన్సిలర్లు మహ్మద్ సమియొద్దీన్, సత్యనారాయణ, గణేశ్, అభిమన్యు శ్రీనివాస్, శ్రీను, శ్రీనివాస్, కరుణాకర్‌రెడ్డి, ఖలీల్ పాల్గొన్నారు.