మర్రిగూడ, సెప్టెంబర్ 5 : ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్శితులై గ్రామాలాభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. కమ్మగూడెం ఎంపీటీసీ శిలువేరు విష్ణు, గ్రామశాఖ అధ్యక్షుడు కొయ్య ఆరోగ్యయ్య ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన 30కుటుంబాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోమవారం ఆయన సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన జడ్పీటీసీ పాశం సురేందర్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్ కార్యకర్తలకు గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి సాదరంగా ఆహ్వానించారు.
అనంతరం మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నిక అభివృద్ధికి, స్వార్థపూరిత కుట్రకు మధ్య జరుగుతున్నదన్నారు. ప్రజలందరూ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపించే టీఆర్ఎస్ని కోరుకుంటున్నారన్నారు. పచ్చని తెలంగాణలో చిచ్చు పెట్టేందుకు బీజేపీ కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ప్రజలిచ్చిన ఎమ్మెల్యే పదవిని తన స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీకి తాకట్టు పెట్టిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి బుద్ధి చెప్పేందుకు మునుగోడు ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. టీఆర్ఎస్ శ్రేణులు మునుగోడు ఉప ఎన్నికకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సింగిల్ విం డో డైరెక్టర్ లావణ్యాఅంతయ్య, నాయకులు డామియేన్, అమృతయ్య పాల్గొన్నారు.
చిమిర్యాలలో..
సంస్థాన్ నారాయణపురం : మండలంలోని చిమిర్యాల గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన మూడు కుటుంబాల కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో చౌటుప్పల్‌లో సోమవారం టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు దోనూరి జైపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ రాజు పాల్గొన్నారు.
బీజేపీ మాయమాటలు నమ్మొద్దు : కూసుకుంట్ల
చండూరు : బీజేపీ మాయమాటలు నమ్మి అందులో చేరి మోసపోవద్దని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నాయకులకు సూచించారు. వారం రోజుల క్రితం టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన చొప్పరివారిగూడెం సర్పంచ్ భర్త చొప్పరి వెంకన్న చౌట్టుప్పల్లో సోమవారం ఆయన సమక్షంలో తిరిగి టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా సర్పంచ్ అనూరాధ మాట్లాడుతూ కొందరు బీజేపీ నాయకుల మాయమాటలు నమ్మి తన భర్త పార్టీ మారారన్నారు. సీఎం కేసీఆర్ తమ ఊరును గ్రామపంచాయతీగా చేయడంతోనే తాను మొట్టమొదటి సర్పంచ్ అయ్యానన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే తమ గ్రామం అభివృద్ధి జరుగుతుందని ధీమా వ్యక్తంచేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు పెద్దగోని వెంకన్న, నాయకుడు సురేశ్ పాల్గొన్నారు.
వివిధ పార్టీల నుంచి..
చండూరు(గట్టుప్పల్) సెప్టెంబర్ 5 : గట్టుప్పల మండలంలోని తేరట్పల్లి గ్రామ సర్పంచ్ వీరమళ్ల శ్రీశైలం ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఇద్దరు వార్డు సభ్యులతో పాటు వివిధ పార్టీలకు చెందిన 100మంది కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో చౌట్టుప్పల్లో సోమవారం టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నియోజకవర్గ ప్రజలు ప్రస్తుతం టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, వర్కాల మధుసూదన్, బండారు రాములు, బొట్ట సైదులు, గడ్డం కృష్ణ పాల్గొన్నారు.