బీబీనగర్(భూదాన్‌పోచంపల్లి), సెప్టెంబర్ 5 : వ్యవసాయ బావుల వద్ద ఏర్పాటు చేసిన మోటర్లను దొంగలిస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్నట్టు చౌటుప్పల్ ఏసీపీ ఉదయ్‌రెడ్డి తెలిపారు. సోమవారం భూదాన్‌పోచంపల్లి పోలీస్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. బీదర్‌కు చెందిన సందీప్, నజీర్ ఖాన్, సతీశ్ దేవకట్టే, ఖాదర్, హైదరాబాద్‌కు చెందిన షాకిర్, షకీల్ ముఠాగా ఏర్పడి యాదాద్రి జిల్లా పరిసర ప్రాంతాల్లో రాత్రి సమయంలో కారులో ప్రయాణిస్తూ రోడ్డుకు ఇరువైపులా ఉన్న పొలాల్లో బావులు, బోర్లకు బిగించిన విద్యుత్ మోటర్లను గుర్తించి వాటి విద్యుత్ కనెక్షన్ కత్తిరించి ఎత్తుకెళ్లి హైదరాబాద్‌లో అమ్ముతున్నట్లు ఏసీపీ తెలిపారు. వీరు నాలుగు నెలల క్రితం రామన్నపేట, వలిగొండ, బీబీనగర్, పోచంపల్లి, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్స్టేషన్ల పరిధిలో 55 బావుల మోటర్లు, ఒక ట్రాన్స్ఫార్మర్ పగులగొట్టి కాపర్‌వైర్‌ను దొంగిలించారు.
అయితే దొంగలను పట్టుకునేందుకు పోలీసులు చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నారు. పరిసర గ్రామాల్లో రాత్రి వేళల్లో నిఘా పెంచారు. ఆదివారం రాత్రి మండలంలోని కనుముక్కుల గ్రామ శివారులో బోరు మోటరు దొంగిలిస్తుండగా పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఆరుగురు నిందితుల్లో ఐదుగురిని అదుపులోకి తీసుకోగా ఒకరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి 9 విద్యుత్ మోటర్లు, కారు, బైక్, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులను భువనగిరి కోర్టుకు రిమాండ్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. సమావేశంలో చౌటుప్పల్ సీఐ వెంకటయ్య, ఎస్ఐ సైదిరెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.