మునుగోడు, ఆగస్టు 30 : పేదరికంతో ఏ విద్యార్థి చదువుకు దూరం కావొద్దనే ఉన్నత లక్ష్యంతో 2017లో కస్తూరి ఫౌండేషన్‌ను స్థాపించారు శ్రీచరణ్. నాటి నుంచి కోట్ల రూపాయల ఖర్చుతో వందలాది ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు మెరుగుపరిచి ఆదర్శంగా తీర్చిదిద్దారు. ఎంతోమంది పేద విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలిచారు. ఒకవైపు విద్యారంగ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే మరోవైపు పర్యావరణ పరిరక్షణపై నడుం బిగించారు. ప్రజలను చైతన్యం చేస్తూ ఏటా మట్టి గణనాథులను శ్రీచరణ్ పంపిణీ చేస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారైన విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల కలిగే నీటి కాలుష్యంపై పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో పాటు ప్లాస్టిక్ బ్యాగుల వాడకాన్ని తగ్గించి జ్యూట్ సంచుల వినియోగాన్ని పెంచేందుకు ఫౌండేషన్ తరపున విస్తృతంగా ప్రజలను చైతన్యం చేస్తున్నారు.
ఈసారి 8 వేల విగ్రహాలు..
గతేడాది వినాయక చవితికి కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మునుగోడు, నల్లగొండ, హాలియా, మిర్యాలగూడలో సుమారు 6 వేల మట్టి గణపతి విగ్రహాలతో పాటు జ్యూట్ బ్యాగులను శ్రీచరణ్ పంపిణీ చేశారు. ఈ ఏడాది 8 వేల విగ్రహాలను పంపిణీ చేశారు.
కాలుష్య రహిత సమాజమే లక్ష్యం..
ఫౌండేషన్ సేవలు విద్యా రంగానికే పరిమితం కావొద్దనే ఉద్దేశంతోనే పర్యావరణ పరిరక్షణ కోసం విరివిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ శ్రీచరణ్ తెలిపారు. ఇందులో భాగంగానే ప్రతియేటా మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే ప్లాస్టిక్ సంచుల వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించాం. మట్టి గణనాథులను పూజించేలా ప్రజలను చైతన్యం చేసి తద్వారా కాలుష్య రహిత సమాజాన్ని అందించాలనే లక్ష్యం తో ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు.
వైఆర్పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో..
రామగిరి : పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా గత ఆరేండ్లుగా వేల సంఖ్యలో ప్రజలకు మట్టి గణపతి విగ్రహాలను అందిస్తూ ముందుకు సాగుతున్నది చైర్మన్ యెలిశాల రవిప్రసాద్ ఆధ్వర్యంలో వైఆర్పీ ఫౌండేషన్. జిల్లా కేంద్రానికి చెందిన రవిప్రసాద్ రెండేండ్ల క్రితం వైఆర్పీ పేరుతో ఫౌండేషన్ స్థాపించారు. ఒకవైపు విద్యారంగం మరోవైపు పర్యావరణ రంగంపై కార్యక్రమాలు చేస్తూ ముం దుకు సాగుతున్నారు. ఈ క్రమంలో భాగంగా పర్యావరణానికి హాని కలుగని విధంగా ఆరేండ్లుగా వినాయక చవితికి 10 నుంచి 15 వేల మట్టి విగ్రహాలను అందజేస్తున్నారు.