భువనగిరి కలెక్టరేట్, ఆగస్టు 29 : వ్యవసాయ భూముల సమస్య పరిష్కారా లకు, సులభతర రిజిస్ర్టేషన్లకు ధరణి వేదికైందని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. భారతదర్శిని వారం రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ డైరెక్టర్ జనరల్ బెనహర్ మహేశ్‌దత్తా ఎక్కా సూచనల మేరకు ఒరిస్సా రాష్ర్టానికి చెందిన డిప్యూటీ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, బ్లాక్ డెవలప్మెంట్ అధికారులు, డిప్యూటీ తాసీల్దార్లతో కూడిన 54మంది అడ్మినిస్ట్రేటీవ్ సర్వీస్ అధికారుల బృందం సభ్యులు సోమవారం కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆమె ధరణి పోర్టల్‌తో అందుతున్న సేవలను పవర్ ప్రజెంటేషన్‌తో బృందం సభ్యులకు వివరించారు.
ధరణి పోర్టల్‌తో అందిస్తున్న 33మాడ్యూల్స్ సేవలు, పది సమాచార మాడ్యూల్స్ సేవల గురించి తెలియజేశారు. పోర్టల్‌తో వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోలు పారదర్శకతతో వేగంగా నిర్వహిస్తున్నామన్నారు. ఎలక్ట్రానిక్ పాస్ పుస్తకం మంజూరు, పట్టాదారు ప్రమేయం లేకుం డా ఎలాంటి మార్పులు, చేర్పులకు అవకాశాలు లేవని చెప్పారు. ఎన్ఆర్ఐలకు సైతం కొనుగోలు అమ్మకాలు జరుపుకునే అవకాశం ఉందని తెలిపారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ కోఆర్డినేటర్లు శ్రీనివాస్, శ్రీనివాస్ ఉన్నారు.
భువనగిరి కలెక్టరేట్ : జిల్లాలో 1నుంచి 19ఏండ్ల వయస్సు గల పిల్లలందరికీ సెప్టెంబర్ 9, 15 తేదీల్లో ఆల్బెండజోల్ ట్యాబ్లెట్లు అందించి వంద శాతం లక్ష్యం సాధించాలని కలెక్టర్ పమేలాసత్పతి అధికారులను ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ టాస్క్‌ఫోర్స్ కమిటీతో జాతీయ నూలి పురుగుల వారోత్సవం నిర్వహణపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. జిల్లాలో 1-19ఏండ్ల వయస్సు కలిగిన పిల్లలు 1,66,936మంది ఉన్నారని, వీరందరికీ టాబ్లెట్లు అందించాలన్నారు.
ఇందుకోసం పిల్లల తల్లిదండ్రులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు. అన్ని పాఠశాలలు, కళాశాలలు,అంగన్వాడీ కేంద్రాల్లో వంద శాతం పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ కావూరి మల్లికార్జున్‌రావు, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ చిన్నానాయక్, డీఈఓ కే.నారాయణరెడ్డి, జడ్పీ డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్‌రావు, సంక్షేమ శాఖల అధికారులు మంగ్తానాయక్, యాదయ్య, కృష్ణవేణి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రశాంత్, ఆర్బీఎస్కే కోఆర్డినేటర్ డాక్టర్ వినోద్, సఖి సెంటర్ నిర్వాహకురాలు ఎన్జీఓ డాక్టర్ ప్రమీల, సుమన్‌కళ్యాణ్ పాల్గొన్నారు.