సూర్యాపేట, ఆగస్టు 27 (నమస్తేతెలంగాణ) : 25 ఏండ్లుగా బీజేపీ ఏలుబడిలో ఉన్న ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో వృద్ధులకు ఇచ్చే పింఛన్ కేవలం రూ.750 మాత్రమేనని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. అందులో వికలాంగులకు ఇచ్చేది రూ.600 మాత్రమే అన్నారు. దేశంలో పెద్దది, బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో వృద్ధులు, వితంతువులతోపాటు వికలాంగులకు ఇచ్చే పింఛన్ రూ.600 మాత్రమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన కొత్త పింఛన్లను సూర్యాపేట మున్సిపాలిటీ, సూర్యాపేట రూరల్‌లో శనివారం లబ్ధిదారులకు అందజేశారు.
జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. బీజేపీ రెండు దశాబ్దాలుగా పాలిస్తున్న మధ్యప్రదేశ్‌లో రూ.600 పింఛన్ విదిలిస్తుండగా, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ దొడ్డిదోవన అధికారంలోకి వచ్చిన కర్ణాటకలోనూ రూ.600 మాత్రమే ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు సాలీనా రూ.800 కోట్లు ఇవ్వగా, రాష్ట్రం ఆవిర్భావం అనంతరం అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ఒక్క పింఛన్ల పేరుతోనే సాలీనా రూ.12,000 కోట్లు చెల్లిస్తుందన్నారు.
వృద్ధులు, వితంతువులతో పాటు ఒంటరి మహిళలకు రూ.2,016, దివ్యాంగులకు రూ.3,016 పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అన్నారు. డబుల్ ఇంజిన్ల పేరుతో రాజకీయం వెలగబెడుతున్న కమలనాథులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లే ట్రబుల్ ఇస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఈ పింఛన్లతోటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ తిరుగుబాటు వస్తుందోనన్న మీమాంస వారిని వెంటాడుతుందన్నారు. అందుకే తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు కేంద్రం కింద, మీద పడుతుందని దుయ్యబట్టారు.
బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు కాకుండా అడ్డుకోవడం, కేంద్రం ఇవ్వాల్సిన నిధులను ఇవ్వకపోవడం, రాష్ట్రం నుంచి వసూలు చేసిన పన్నులు తిరిగి రాష్ర్టానికి అందించకుండా మోకాలడ్డుతున్నారని మండిపడ్డారు. అయినా కొత్తగా మంజూరైన 10 లక్షల మందితోపాటు మొత్తం రాష్ట్రంలో 46 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. కొత్తగా మంజూరై వాటితో కలిపి ఒక్క సూర్యాపేట నియోజకవర్గంలోనే 38,068 మందికి పింఛన్లు ఇస్తున్నట్లు తెలిపారు.
అన్నింటికీ మించి తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో సరఫరా అవుతున్న 24 గంటల నాణ్యమైన విద్యుత్ బీజేపీ పాలకులకు కంటగింపుగా మారిందన్నారు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లో కేవలం ఆరు గంటలు మాత్రమే విద్యుత్ ఇస్తారని, వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టి రీడింగ్ ప్రకారం రైతాంగం నుంచి చార్జీలు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ పాలనలో గ్యాస్ ధర రూ.1100 పైగా ఎగబాకిందన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం, డీఆర్డీఓ కిరణ్‌కుమార్, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.