నేరేడుచర్ల/పాలకవీడు : ఆది దేవుడు విఘ్ననాథుడి పూజకు వేళైంది. ఊరూ వాడ గణపతిని ప్రతిష్ఠించి ఉత్సవాలు జరిపేందుకు చిన్నా, పెద్ద సిద్ధమవుతున్నారు. సర్వ విఘ్నాలు తొలగించే ఏక దంతుడి విగ్రహాలు సకల జీవ కోటికి హాని కలిగించకుండా ఉండేందుకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను కాకుండా మట్టి ప్రతిమలను వినియోగించాలని పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో మట్టి గణపతిని పూజించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం.
వినాయకచవితి సందర్భంగా బంకమట్టితో చేసిన విగ్రహాలకే పూజలు చేయాలని వేద పండితులు చెబుతున్నారు. పంచభూతాల్లో ఒక్కటైన నేల నుంచి ఉత్పన్నమయ్యే మట్టితో చేసిన విగ్రహాలకు పూజ ప్రారంభంలో ప్రాణ పత్రిష్ఠ చేస్తే సకల శుభాలు కలుగుతాయని వేదాలు చెబుతున్నాయి. ఆలయాల్లో స్వయంభూ విగ్రహాలకున్నంత శక్తి, ప్రాధాన్యం ఈ మట్టి విగ్రహాలకు ఉంటుంది. అంతేగాక బంకమట్టితో చేసిన విగ్రహాలను నిమజ్జనం చేయడంతో నీటిలో ఔషధ గుణాలు పెరుగుతాయి. అంతేగాకుండా నీటిలో సులభంగా కరిగిపోతాయి. సంప్రదాయ పూజలకు ప్రాధాన్యం ఇచ్చినట్లువుతుంది.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసే విగ్రహాల్లో విషతుల్యమైన రంగులను వినియోగించడం వల్ల పర్యావరణానికే కాకుండా మానవాళికే హాని కలుగుతుంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ఇనుము తదితర పదార్థాలు నిమజ్జనం తర్వాత నీటిలో కరుగవు. దాంతో చెరువుల్లోని నీరు కలుషితమై అందులో జీవించే జీవరాసులు అంతరించిపోయే ప్రమాదం ఉంది. చెరువుల్లోని నీరు ఇంకిపోయే కొద్దీ ఆ కలుషితాలు, రంగులు చెరువుల అడుగుభాగంలో చేరి వాతావరణ సమతౌల్యాన్ని దెబ్బ తీస్తాయి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారైన విగ్రహాల్లో లెడ్, కాడ్మియం, క్రోమియం, కాఫర్, మెర్క్యురీ వంటి హానికర రసాయనాలుంటాయి. ఇవి జీవరాశులకు అతి ప్రమాదకరమైనవి. ఈ చెరువుల్లోని చేపలను తింటే క్యాన్సర్ కారక జబ్బులు సోకే ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.