ఉద్యోగ, ఉపాధి కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో పరిశ్రమల ఏర్పాటుకు పూనుకుంది. చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం ఇండస్ట్రియల్ పార్కులో 400 పరిశ్రమలు నెలకొల్పి ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 వేల మందికి ఉపాధి కల్పించేందుకు పనులు మొదలు పెట్టింది. ఇప్పటికే 50 పరిశ్రమలు పూర్తికాగా వచ్చే దసరా నాటికి ఉత్పత్తులను ప్రారంభించనున్నాయి. దీని ద్వారా ప్రస్తుతం 5 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మరో 150 పరిశ్రమలు నిర్మాణ దశలో ఉన్నాయి. వచ్చే ఏడాది డిసెంబర్ చివరి నాటికి అన్ని పరిశ్రమలను అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు రూపొందించారు.
కాలుష్యరహిత పరిశ్రమలకు నిలయంగా ఇది మారనున్నది. ఇందులో యువతకు వివిధ కోర్సులతోపాటు వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించనున్నారు. ఇండస్ట్రియల్ పార్కులోనే వసతి గృహాలు
నిర్మించి ఆర్టీసీ బస్సులను నడిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
చౌటుప్పల్ రూరల్, ఆగస్టు 27 : దేశానికి తలమానికంగా సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో పరిశ్రమల ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది చివరి నాటికి పార్కు పూర్తిస్థాయిలో వినియోగంలోకి రానుంది. కాలుష్యరహిత పరిశ్రమలకు ఈ పార్కు కేరాఫ్‌గా మారనుంది. పార్కు ప్రారంభించిన కొద్ది కాలంలోనే లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నది. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి అన్ని పరిశ్రమలు ఉత్పత్తులు కొనసాగించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ దసరాకు 50కిపైగా పరిశ్రమలు ఉత్పత్తులు ప్రారంభించనున్నాయి. వీటి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దాంతో సుమారు 5 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది.
కాగా ఇప్పటికే ఈ పార్కులో 20 పరిశ్రమలు ఉత్పత్తులు కొనసాగిస్తున్నాయి. మరో 150 పరిశ్రమలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇండస్ట్రీయల్ పార్కు పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తే సుమారు 400 పరిశ్రమలు కొలువుదీరనున్నాయి. ఫలితంగా రూ. 2వేల కోట్ల పెట్టుబడులు రావడమే కాకుండా 40 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలగనున్న సంగతి తెలిసిందే.
అంతేకాకుండా నైపుణ్యం లేని కార్మికులకు కామన్ ఫెసిలిటీ సెంటర్ ద్వారా శిక్షణ కూడా ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన భవన నిర్మాణం కొనసాగుతున్నది. ఈ ఏడాదిలో పూర్తికానుంది. దీని ద్వారా వేలాది మంది వృత్తి నైపుణ్యం లేని యువతకు వివిధ కోర్సుల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించనున్నారు. కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిశ్రమల్లోనే వసతి గృహాలు, అన్ని రకాల సదుపా యాలు ఏర్పాటు చేసేందుకు అడుగులు పడుతున్నాయి. ఇందుకోసం స్థలాలను సైతం ప్రత్యేకంగా కేటాయించి అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం కార్మికులకు రవాణా ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ బస్సులను సైతం నడిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
దండు మల్కాపురం గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్కులో ప్రస్తు తం పలు రకాల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, శీతలపానీయాలు, బోర్‌వెల్స్ బిట్స్, ఎర్త్ డ్రిల్లింగ్, బ్రిక్స్, మిల్క్ పౌచ్‌లు, ప్యాకింగ్ బాక్స్‌లు, లేజర్ కటింగ్ టెస్ట్‌బుక్ ప్రిటింగ్ తదితర తయారీ పరిశ్రమలు ప్రధానంగా ఉన్నాయి.
వచ్చే ఏడాది డిసెంబర్లో ఇండస్ట్రీయల్ పార్కు పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేచ్చేందుకు పనులు వేగవంతం చేస్తున్నాం. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నప్పటికీ మన దగ్గర పరిశ్రమల స్థాపనకు అధికంగా మొగ్గు చూపుతున్నారు. దసరాకు కొన్ని పరిశ్రమలు ఉత్పత్తి కొనసాగిస్తున్న నేపథ్యంలో యువత వృత్తి నైపుణ్యకేంద్రాల్లో శిక్షణ తీసుకుంటే త్వరితగతిన ఉపాధి లభించే అవకాశం ఉన్నది. ఇక్కడ కామన్ ఫెసిలిటీ భవనం కొంతసమయం పడుతోంది. పార్కులోకి కార్మికులకు ఎలాంటి రవాణా ఇబ్బందులు కలుగకుండా ఆర్టీసీ బస్సులు వచ్చేలా ఉన్నత స్థాయి అధికారులతో మాట్లాడుతున్నాం.
– ఎం.గోపాల్‌రావు, పారిశ్రామికవేత్తల సమాఖ్య(టీఫ్), జాయింట్ సెక్రటరీ